Corona Pandamic: మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారనుందని ఐసీఎంఆర్‌కు చెందిన వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. 'మనం మన రక్షణ కవచాల(కొవిడ్ నిబంధనలను ఉద్దేశిస్తూ) విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్‌గా మారనుంది. డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను భర్తీ చేస్తే.. కొవిడ్ ఎండమిక్‌గా మారుతుంది. కొత్త వేరియంట్ పుట్టుకురాకపోతే ఆ అవకాశం ఉంటుంది' అని పాండా అభిప్రాయపడ్డారు.
corona Third Wave In India: నిపుణుల బృందం అంచనా ప్రకారం.. డిసెంబర్ 11తో ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంది. 'మార్చి 11 నుంచి మనకు కొంత ఉపశమనం లభించవచ్చు. అలాగే దిల్లీ, ముంబయిలో కరోనా గరిష్ఠ స్థాయికి చేరిందా..? లేదా..? అనే విషయం చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాల్సి ఉంది. అక్కడ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేం' అని ఆయన తెలిపారు. దిల్లీ, ముంబయిలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80:20 నిష్పత్తిలో ఉన్నాయన్నారు. మహమ్మారి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉందని, దానికి తగ్గట్టే ఐసీఎంఆర్ పరీక్షా వ్యూహాలు మారుస్తుందని చెప్పుకొచ్చారు.