తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త వేరియంట్ భయాలు.. మళ్లీ లాక్​డౌన్ ఉంటుందా?.. ఆ ఫేక్ న్యూస్​లతో జాగ్రత్త!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ బుసలు కొడుతోంది. చైనాను అతలాకుతలం చేసిన కొత్త వేరియంట్​ భారత్​లోనూ వెలుగుచూసింది. పాత రోజులను గుర్తుకు తెచ్చేలా.. అందరూ మాస్కులు పెట్టుకోవాలని కేంద్రం చెబుతోంది. మరి లాక్​డౌన్​ కూడా వచ్చే అవకాశం ఉందా? విమాన రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారా? ఈ ప్రశ్నలకు సంబంధిత వర్గాలు ఏం చెబుతున్నాయంటే?

COVID NEW VARIANT IN INDIA
COVID NEW VARIANT IN INDIA

By

Published : Dec 22, 2022, 4:35 PM IST

దేశంలో కొత్త వేరియంట్ భయాలు మొదలయ్యాయి. మళ్లీ కరోనా గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకైతే మహమ్మారి అదుపులోనే ఉన్నప్పటికీ.. చైనాలో విధ్వంసం సృష్టిస్తున్న బీఎఫ్.7 వేరియంట్ భారత్​లోనూ వెలుగులోకి రావడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. మాస్కులు ధరించాలని కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ సూచించారు. పండగల వేళ అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అటు, కరోనా నియమాలను పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం కోరుతోంది. వీటితో పాటు పలు సూచనలు చేసింది.

  • బహిరంగ ప్రదేశాల్లో ఫేస్​మాస్కులు తప్పక ఉపయోగించాలి.
  • భౌతిక దూరం పాటించాలి.
  • సబ్బు, నీళ్లతో చేతులను తరచుగా కడుక్కోవాలి. లేదా శానిటైజర్ ఉపయోగించాలి.
  • వివాహాలు, రాజకీయ సభలు వంటి ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాలకు వెళ్లొద్దు.
  • అంతర్జాతీయ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది.
  • జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉంటే వైద్యుడిని కలవాలి.
  • వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలి. ప్రికాషన్ డోసు వేయించుకోవాలి.
  • ప్రభుత్వం జారీ చేసే నియమాలను అనుసరించాలి.

దేశంలో బలమైన వైద్య వ్యవస్థ ఉందని మెడికల్ అసోసియేషన్ చెప్పుకొచ్చింది. ఔషధాలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపింది. నిపుణులైన వైద్య సిబ్బంది, ప్రభుత్వ నాయకత్వంతో ఎలాంటి పరిస్థితినైనా భారత్ ఎదుర్కొంటుందని పేర్కొంది. అయితే, 2021 నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సన్నద్ధత మరింత పెంచాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది.

లాక్​డౌన్ ఉంటుందా?
కరోనా వైరస్ భయాల నేపథ్యంలో దేశంలో మళ్లీ లాక్​డౌన్ ఉంటుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి! అయితే, మళ్లీ లాక్​డౌన్ ఉండే అవకాశం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్​కు చెందిన డాక్టర్ అనిల్ గోయల్ తెలిపారు. దేశంలోని 95 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తైనందున లాక్​డౌన్ అవసరం లేదని చెప్పారు. 'దేశంలోని ప్రజల రోగనిరోధక వ్యవస్థ.. చైనీయులతో పోలిస్తే బలంగా ఉంది. భారత్​లో టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్ వ్యూహం అమలు చేస్తే సరిపోతుంది' అని అనిల్ గోయల్ పేర్కొన్నారు.

ఫేక్​ న్యూస్​తో జాగ్రత్త..
ఇదిలా ఉండగా.. దేశంలో ఒమిక్రాన్ ఎక్స్​బీబీ వేరియంట్ వ్యాపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం మొదలైంది. దగ్గు, జ్వరం వంటి లక్షణాలేవీ లేకుండానే వైరస్ ప్రభావం చూపుతోందని.. కొత్త వేరియంట్ వల్ల కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడ, వెన్ను నొప్పులు వస్తున్నాయని ఓ లేఖ వైరల్ అవుతోంది. అయితే, ఇది ఫేక్ అని కేంద్ర వైద్య శాఖ స్పష్టం చేసింది. అందులో ఉన్న వివరాలన్నీ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని తెలిపింది.

చైనాలో విలయం
తొలిసారి కొవిడ్‌ బయటపడిన చైనాలో మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. అక్కడ వైరస్‌ విజృంభణకు ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్.7 కారణమని నిపుణులు తేల్చారు. ఈ వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదుకాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే విమానాలను అడ్డుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పౌర విమానయాన వర్గాలు స్పష్టం చేశాయి. 'చైనా నుంచి భారత్​ నేరుగా విమానాలు రాకపోకలు జరగడం లేదు. చైనా మీదుగా వచ్చే ఇతర దేశాల విమానాలను ఆపాలని మాకు ఆదేశాలు అందలేదు. పౌరవిమానయాన శాఖ పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. తుది నిర్ణయం ఏదైనా కేంద్ర వైద్య శాఖే తీసుకోవాలి' అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

ABOUT THE AUTHOR

...view details