చైనా, జపాన్ సహా వివిధ ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండం వల్ల భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. వైద్య రంగం సన్నద్ధతపై మంగళవారం మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం సూచన మేరకు మంగళవారం రాష్ట్రాలు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నాయి.
ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ లభ్యత, వైద్య సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై మంగళవారం మాక్ డ్రిల్ జరగనుంది. నర్సులు, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లను సైతం మాక్ డ్రిల్‌లో భాగస్వాములు కానున్నారు. ముఖ్యంగా ఐసీయూ పడకలు, వెంటిలేటర్ పడకల లభ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలలో నిర్ధరణ పరీక్షలు ప్రారంభమయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ ద్వారా తెలిపారు.