Covid JN1 Variant Severity :కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తిపై దేశవ్యాప్తంగా భయాందోనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర పర్యటకశాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్ కీలక ప్రకటన చేశారు. కొవిడ్ జేఎన్ 1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్ గతంలోనే పోరాడిందని కొత్త వేరియంట్‌పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరంలేదన్నారు. లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంటుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ 'భయపడాల్సిన అవసరం లేదు. కొవిడ్ మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం' అని సమాధానమిచ్చారు. ఆయన ఆదివారం గోవాలో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరం లేదు'
భారత్‌లో వెలుగు చూసిన కొవిడ్ కొత్త ఉపరకం జేఎన్ 1 కోసం అదనపు డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) అధిపతి డాక్టర్ ఎన్‌కే అరోరా తెలిపారు. అయితే, ఈ ఉపరకం వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. '60 ఏళ్లు పైబడినవారు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ఉపరకంతో అప్రమత్తంగా ఉండాలి. దీనికి అదనపు డోస్ వ్యాక్సిన్ అవసరంలేదు. ప్రతి వారం దేశంలో కొత్త ఉపరకం వస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటి వరకు సుమారు 400కు పైగా ఉపరకాలను గుర్తించాం. ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయి. ఈ వేరియంట్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతోపాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నుంచి రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చు' అని అరోరా తెలిపారు.