Covid impact on auto drivers: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన క్రమంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే, కరోనా దెబ్బతో కొందరు ఇంకా కోలుకోలేకపోతున్నారు. అలాంటి కోవకే చెందుతారు మహారాష్ట్ర, పుణెకు చెందిన ఓ ఆటో డ్రైవర్. అతడికి కరోనా సోకలేదు, కుటుంబ సభ్యుల్లో ఎవర్నీ కోల్పోలేదు, కానీ, వైరస్ కారణంగా ఆర్థికంగా చితికిపోయారు. దీంతో తన బతుకుబండిని నడిపించేందుకు ఆటోనే ఇంటిగా మార్చుకుని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ తరుణంలోనే ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.
ఇదీ జరిగింది:పుణెకు చెందిన సంతోశ్ దివేత్ ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన సంపాదనపైనే కుటుంబం నడవాలి. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా సంక్షోభం.. వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. కుటుంబాన్ని పోషించుకోవటం భారంగా మారింది. కరోనా కారణంగా ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోవాల్సి వచ్చింది. దీంతో బయట ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో తన భార్య, కుమారుడిని అత్తవాళ్లింట్లో వదిలేశారు సంతోశ్. కానీ, ఆయన అక్కడే ఉండేందుకు ఇష్టపడలేదు.
ఉండేందుకు ఇల్లు లేకపోవటం వల్ల తన ఆటోనే ఇంటిగా మార్చుకున్నారు సంతోశ్. పెట్రోల్ పంపులు, ఏటీఎంల వద్ద ఆటోను నిలిపి.. కస్టమర్ల కోసం వేచి చూస్తారు. జానెడు పొట్ట నింపుకొనేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఒక్కోసారి కేవలం వడాపావ్ తిని ఆటో నడిపేవారు సంతోశ్. కొన్ని రోజులు కరోనా బాధితులకు అందించే ఉచిత భోజన వితరణలో పాల్గొని కడుపునింపుకొనేవారు.
రెండేళ్లుగా ఆటోలోనే:కష్టాలు పడుతూనే రెండేళ్లుగా ఆటోలో జీవనం సాగిస్తున్నారు సంతోశ్. ఎక్కువ సమయం ఆటో నడపటం వల్ల ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కానీ, ఆసుపత్రికి వెళ్లటం లేదా ఆటోను వదిలి వేరేప్రాంతంలో నివసించేందుకు ఇష్టపడటం లేదు.