భారత్‌లో కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఈ వార్తలు అవాస్తవం, పూర్తిగా అస్పష్టం అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా మరణాలను లెక్కించేందుకు దేశంలో పటిష్ఠమైన వ్యవస్ధ అందుబాటులో ఉందని తెలిపింది. గ్రామ పంచాయతీ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు సమాచార సేకరణ వ్యవస్ధ ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాలను పారదర్శక విధానంలో నమోదు చేస్తున్నామని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమాచారాన్ని స్వతంత్రంగా అందించిన తర్వాత కేంద్రం నమోదు చేస్తుందని వివరించింది. కరోనా మరణాలను రాష్ట్రాలు క్షేత్ర స్ధాయిలో నిర్ణీత సమయం లోపు నమోదు చేయాలని కేంద్రం సూచిస్తోందని తెలిపింది.
భారత్‌లో కరోనా మరణాలు 2021 నవంబర్ వరకు కేంద్రం అధికారికంగా ప్రకటించిన 4లక్షల 60వేలు కాదని, అవి 32లక్షల నుంచి 37 లక్షల వరకు ఉంటాయని ఓ పరిశోధనా పత్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది.
ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ అవసరం లేదు..
కేరళ, గోవాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ చూపించాలనే షరతును కర్ణాటక ప్రభుత్వం ఎత్తి వేసింది. అన్ని రకాల రవాణా మార్గాల ద్వారా కేరళ, గోవా నుంచి రాష్ట్రానికి వచ్చే వారు నెగెటివ్ రిపోర్ట్ చూపించాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే. సుధాకర్ ట్వీట్ చేశారు.