Covid compensation: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 10వేల మంది పిల్లలకు సాయం చేయటంపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. అనాథలైన పిల్లలను చేరదీసి పరిహారం అందించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కొవిడ్-19 మృతుల కుటుంబాలకు రూ.50వేల ఎక్స్గ్రేషియా పంపిణీ చేయకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలకు సమన్లు జారీ చేసింది. పరిహారం చెల్లించలేకపోవటంపై వివరణ ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.
అలాగే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది సుప్రీం కోర్టు. కరోనా పరిహారం పంపిణీపై గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవటంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వైరస్ సహా ఇతర కారణాలతో 10వేల మంది పిల్లలు అనాథలుగా మారారని, వారికి సాయం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది.. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం.
" బాల్ స్వరాజ్ పోర్టల్లో పొందుపరిచిన డేటా ప్రకారం దేశంలో 10వేల మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. పరిహారం కోసం వారు దరఖాస్తు చేసుకోవటం చాలా కష్టమైన పని. అలాంటి చిన్నారులను చేరదీయాలని ఆయా రాష్ట్రాలను ఆదేశిస్తున్నాం. వారికి పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలో నమోదైన మరణాలు, బాల్ స్వరాజ్ పోర్టల్లోని వివరాలను రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి అందించాలి."
- ధర్మాసనం.