Covid Cases In India Today : దేశంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 529 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,093కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. వైరస్ బారిన పడి మంగళవారం ముగ్గురు చనిపోయారని అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు కర్ణాటక వాసి కాగా మరొకరు గుజరాత్‌కు చెందినవారని చెప్పారు.
భారత్‌లో విజృంభిస్తున్న జేఎన్.1 వేరియెంట్
Covid New Variant Cases In India : మంగళవారం (డిసెంబర్ 26) వరకు భారత దేశంలో మొత్తం 109 కొవిడ్ ఉపరకం జేఎన్.1 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో గుజరాత్ నుంచి 36, కర్ణాటక- 34, గోవా- 14, మహారాష్ట్ర- 9, కేరళ- 6, రాజస్థాన్- 4, తమిళనాడు- 4, తెలంగాణ నుంచి 2 కేసులు ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.