తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 6 నెలల తర్వాత అత్యధిక కొవిడ్​ కేసులు.. మళ్లీ మాస్క్​ తప్పదా?

భారత్​లో ఆరు నెలల తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 3,824 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

covid cases in india
covid cases in india

By

Published : Apr 2, 2023, 10:49 AM IST

Updated : Apr 2, 2023, 11:08 AM IST

దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 184 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 3,824 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

  • దేశవ్యాప్తంగా కొత్తగా 3,824 కేసులు నమోదయ్యాయి.
  • 184 రోజుల తర్వాత దేశంలో ఒక రోజులో అత్యధిక కేసులు ఇవే.
  • కొత్తగా కొవిడ్ వైరస్ వల్ల ఐదుగురు మరణించారు.
  • కొవిడ్​ సోకడం వల్ల దిల్లీ, హరియాణా, రాజస్థాన్​ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు.. కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,881కు చేరింది.
  • దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18,389కు చేరింది.
  • డైలీ పాజిటివిటీ రేటు 2.87 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు​ 2.24 శాతానికి చేరింది.
  • కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,22,605 మందికి కొవిడ్​ సోకింది.
  • కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,73,335 కాగా.. రికవరి రేట్​ 98.77గా ఉంది.
  • ఇప్పటివరకు 220.66 కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు.

అంతకుముందు.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది వరకు 2,994 కొవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, కేరళలో మొత్తం 9 మంది కొవిడ్ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. యాక్టివ్ కేసులు 16,354కి చేరినట్లు పేర్కొంది.

భారత నౌకాదళ చీఫ్​కు కొవిడ్​..
శనివారం ఉదయం.. భారత నౌకాదళ అధిపతి ఆర్​. హరికుమార్​ కొవిడ్ బారినపడ్డారు. మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో కంబైన్డ్ కమాండర్స్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్​గా నిర్ధరణ అయ్యిందని అధికారులు తెలిపారు. నేవీ చీఫ్ హరికుమార్ వెంటనే దిల్లీకి తిరుగు పయనమైనట్లు పేర్కొన్నారు.

కేంద్రం అప్రమత్తం..
ఈ ఏడాది మార్చి 25న దేశంలో కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్‌లలో కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య, కొవిడ్‌ మరణాలు తక్కువే ఉన్నాయని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని చెప్పింది కేంద్రం. పరిస్థితులను అన్ని రాష్ట్రాలు క్షుణ్నంగా పరిశీలించి.. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించింది. జనం గుంపులుగా ఉండే పరిస్థితులను నియంత్రించాలని.. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు తప్పక మాస్క్ ధరించాలని హితవు పలికింది. కొవిడ్‌ పరీక్షలు పెంచి, లక్షణాలపై తప్పకుండా నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.

Last Updated : Apr 2, 2023, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details