Covid Cases in Mumbai: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఆందోళకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 36,265 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో 79 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి చేరింది. 381 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,847గా ఉంది.
ముంబయిలో కొత్తగా 20,181 కేసులు బయటపడ్డాయి. నాలుగు మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 79,260కు చేరింది. నగరంలోని ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.
- దిల్లీలో కొత్తగా 15,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 15.34 శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నగరంలోని ఆక్సిజన్ బెడ్స్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. దిల్లీలో మొత్తం ఆక్సిజన్ బెడ్ల సామర్థ్యం 12,104 కాగా.. 1,116 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు.
- బంగాల్లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 15,421 మందికి వైరస్ సోకగా 7,343 మంది కోలుకున్నారు. 19 మంది మృతిచెందారు.
- కేరళలో కొత్తగా 4649 మందికి కరోనా సోకింది. 2180 మంది కోలుకోగా.. 221 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 49,116కు చేరింది.
- ఒడిశాలో కొత్తగా 1,897 కరోనా కేసులు బయటపడ్డాయి. వీరిలో 258 మంది చిన్నారులు ఉన్నారు. ఒక ఒమిక్రాన్ మరణం నమోదైంది. భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
- హరియాణాలో 146 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 87 మంది రెసిడెంట్ డాక్టర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 10 రోజుల్లో 196 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 35 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 106కు చేరింది.
సీఎం, కేంద్రమంత్రికి కరోనా..
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది. మరోవైపు కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్‌కు కూడా కరోనా సోకింది. తమకు కరోనా సోకినట్లు వారు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
'నిబంధనలు ఉల్లంఘిస్తే ఓపెన్ జైలుకే'
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఆంక్షలు కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆంక్షలను మరింత కఠినం చేస్తోంది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారి కోసం 'ఓపెన్ జైలు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. ప్రస్తుతం ఉన్న జరిమానాను పెంచే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 1033 కరోనా కేసులు బయటపడ్డాయి.