Covid Cases In India :దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 841 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. గత 227 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,309కి చేరిందని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గత 24 గంటల్లో(ఆదివారం ఉదయం 8 వరకు) వైరస్ బారిన పడి మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో కేరళ, కర్ణాటక, బిహార్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు తెలిపారు.
తీవ్రత పెరుగుతోంది!
2023 డిసెంబరు 5 వరకు దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి చెందుతుండడం, పైగా శీతాకాలం కావడం వల్ల ప్రస్తుతం ఈ కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ప్రజలు అందరూ కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
220.67 కోట్ల వ్యాక్సిన్‌లు పంపిణీ
ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్సైట్ ప్రకారం, దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్లమంది ప్రజలు వైరస్ బారిన పడ్డారు. 5.3 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దీని నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు చేరింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.