Covid cases in eastern states: గడిచిన రెండు వారాలుగా పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు, కొవిడ్ యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. రక్షణ కవచాలను విస్మరించొద్దని సూచించారు. ఐదు ఈశాన్య రాష్ట్రాలతో కరోనా పరిస్థితులపై సమీక్షించారు కేంద్ర మంత్రి.
ఒడిశా, బిహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, బంగాల్ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సమాచార కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటును పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు మాండవీయ. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని స్పష్టం చేశారు.
" గత రెండు వారాలుగా కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అప్రమత్తంగానే ఉండాలి. ఆసుపత్రుల్లో చేరుతున్నవారు, మరణాలను నిశితంగా పరిశీలించాలి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారు, ఆక్సిజన్ సపోర్ట్ అవసరమైనవారు, మరణాల్లో టీకా తీసుకున్నవారు, టీకా తీసుకోనివారు ఎంత మంది ఉన్నారన్న వివరాలు ఎప్పటికప్పుడు సేకరించాలి."
- మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.