కరోనా కొత్త మ్యూటెంట్లు, భవిష్యత్‌లో రాబోయే విలయాలను ఎదుర్కొనేందుకు కరోనా నిబంధనల అమలు, వ్యాక్సినేషన్ కీలక అస్త్రాలని చెబుతున్నారు నిపుణులు. ప్రజలు జాగ్రతలన్నీ పాటిస్తూ, టీకా తీసుకుంటే కొవిడ్ మూడో దశ తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మూడో దశపై ఆందోళన
కొవిడ్ మొదటి దశను తేలికగా తీసుకోవడమే ప్రస్తుత విలయానికి దారితీసిందని అంటున్నారు నిపుణులు. వైరస్‌లో మార్పులే ఇందుకు కారణమన్నది మరికొందరి వాదన. ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్య... మూడో దశ అనివార్యమని, అందుకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ గత బుధవారం అనడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని నిలువరించవచ్చని రెండు రోజుల అనంతరం ఆయన చెప్పుకొచ్చారు.
"కఠిన చర్యల ద్వారా మూడో దశ వ్యాప్తిని కొన్ని ప్రదేశాలకే పరిమితం చేయవచ్చు. వాస్తవానికి దేశం మొత్తం పాకకుండా నిలువరించవచ్చు. అయితే ఆయా రాష్ట్రాల్లో నిబంధనలు సమర్థంగా అమలు అయ్యే తీరుపైనే ఇది ఆధారపడి ఉంటుంది."
-కె విజయ్ రాఘవన్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్
అప్పుడే అయిపోలేదు..
సహజసిద్ధంగా లేదా టీకా ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తి కొద్దినెలల్లో తగ్గుతుందని... అప్పుడు కరోనా మరోమారు విజృంభిస్తుందని హెచ్చరించారు దిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రల్ బయాలజీ నిపుణుడు డాక్టర్ అనురాగ్ అగర్వాల్. మూడో దశ విలయాన్ని ఎదుర్కొనేందుకు స్వీయ జాగ్రత్తలే ప్రధానమని చెప్పారు.
"మూడో దశ రావొచ్చని ఊహించినప్పటికీ.. అది ఎప్పుడు వస్తుందో, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పలేం. అయితే రాబోయే రోజుల్లో ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలి. పెద్ద సంఖ్యలో టీకాల పంపిణీ జరగాలి. అప్పుడు మూడో దశ తీవ్రత తక్కువగా ఉంటుంది."
-డాక్టర్ అనురాగ్ అగర్వాల్
"కరోనా ఎంతో వ్యాగంగా వ్యాపిస్తోంది. అన్ని మ్యూటెంట్లను గుర్తించేంత సమయం శాస్త్రవేత్తలకు ఉండడం లేదు. శరీరంలోని రోగ నిరోధక శక్తి, టీకా, ఔషధాలను కరోనా అధిగమించవచ్చు. కానీ మాస్కు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, ప్రజలు గుమికూడకుండా చూడడం వంటి జాగ్రత్తలు పాటిస్తే.. వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువ" అని వివరించారు రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సీడీ డైరక్టర్ డాక్టర్ అరుణ్ శర్మ.
ఇవీ చదవండి:కరోనాలో కొత్త ఉత్పరివర్తనలు, ప్రొటీన్లు గుర్తింపు
'ఆ మార్పు వల్లే ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి'