కర్ణాటకలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. కొవిడ్‌తో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు ఏడాదికిపైగా ఓ ఆస్పత్రిలోని మార్చురీలో కుళ్లిపోయే స్థితిలో ఉండిపోయాయి.
అప్పటి నుంచి...
కరోనా బాధితులైన 40 ఏళ్ల మహిళ, ఓ 50 ఏళ్ల పురుషుడు.. బెంగళూరు రాజాజీనగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) ఆస్పత్రిలో గతేడాది జూన్‌లో చేరారు. అదే ఏడాది జులైలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వారు మరణించారు. అప్పటి నుంచి వారి మృతదేహాలు ఆదే ఆస్పత్రిలో(Esi hopital dead bodies) ఉండిపోయాయి. ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వర్తించకుండా అలాగే వదిలేశారు.
'కఠినంగా శిక్షించాలి'
ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు జరపాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి ఏ శివరామ్ హెబ్బార్‌కు భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్ సురేష్ కుమార్ లేఖ రాశారు.
"కొవిడ్ మృతదేహాల విషయంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక, ఈఎస్ఐ ఆస్పత్రి అధికారుల పాత్ర శోచనీయం. ఈ విషయంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను రూపొందించాలి. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దురదృష్టకర ఘటనలు ఇంకెప్పుడూ జరగకూడదు."
-ఎస్ సురేశ్ కుమార్, భాజపా ఎమ్మెల్యే.
"కరోనా విజృంభణ సమయంలో హృదయాలను కలచివేసే ఘటనలను ఎన్నింటినో చూశాం కానీ, ఈఎస్ఐ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన మాత్రం అత్యంత దురదృష్టకరమైనది. బాధ్యతారాహిత్యం, అమానవీయ ప్రవర్తనకు ఇది సాక్ష్యంగా నిలుస్తోంది" అని సురేశ్ కుమార్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:నగరంలో 'చిరుత' ఫోబియా.. కుక్కను చూసినా భయంతో..