దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొవిడ్ తీవ్రత ముగిసినట్లు భావించకూడదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. వైరస్ నిర్మూలనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహకార స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. 'హర్ ఘర్ దస్తక్ (ప్రతి ఇంటికీ టీకా)' కార్యక్రమం అమలుపై రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలి. కరోనా ముగిసిందని భావించకూడదు. అంతర్జాతీయంగా కేసులు పెరుగుతున్నాయి. కాబట్టి హర్ ఘర్ దస్తక్ కార్యక్రమాన్ని నిశితంగా పర్యవేక్షించాలి. తద్వారా దేశంలో ప్రతి ఇంటికీ టీకాలు అందించాలి. జిల్లాల్లో నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడానికి కొవిన్ను ఉపయోగించవచ్చు."