దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు మూడో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఈశాన్య రాష్ట్రాలతోపాటు కేరళలో వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉండడంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుంటే కేరళలో మాత్రం నిత్యం 10వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేరళలో కొవిడ్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెండో రోజూ 22వేల కేసులు..
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. దేశవ్యాప్తంగా వైరస్ విలయతాండవం చేసిన సమయంలోనూ కేరళ ప్రభుత్వం మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో కేరళ తీసుకుంటున్న వైరస్ కట్టడి చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా కొనియాడింది. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం గడిచిన 24గంటల్లో అత్యధికంగా 22వేల పాజిటివ్ కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. కొత్తకేసులతో కలిపి ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33 లక్షల 27 వేలును దాటింది. అంతేగాకుండా వైరస్ దాటికి ఇప్పటివరకు 16,457 మంది చనిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినప్పటికీ కేరళలో ఇంకా 10శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి.
వ్యాక్సినేషన్‌లో ముందున్నప్పటికీ..!
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ వేగంగా అందిస్తోంది. అక్కడ 18ఏళ్ల వయసున్న జనాభాలో 21శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్ అందించింది. దేశ సరాసరి 9.9శాతం ఉండగా కేరళ అంతకుమించి పంపిణీ చేసింది. అయనప్పటికీ కరోనా కేసుల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ముఖ్యంగా ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశవ్యాప్తంగా సరాసరిగా 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే, కేరళలో మాత్రం 42.7శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48శాతం కేరళ ప్రజలకు వైరస్ ముప్పు పొంచివుందనే అర్థమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అక్కడ ఎక్కువ కేసులు బయటపడుతున్నాయనే అనుమనం వ్యక్తం చేస్తున్నారు.