దేశంలో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంపై వస్తున్న వదంతులను కేంద్రం కొట్టిపారేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై వాస్తవాలను వక్రీకరించే ప్రకటనలను ఖండించింది. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీపై ఉన్న వదంతులు వాస్తవాలను బయటపెట్టింది. ఈ వివరాలను నీతి ఆయోగ్ సభ్యుడు, కొవిడ్ టీకాపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం అధ్యక్షుడు డా. వినోద్ పాల్ వెల్లడించారు.
విదేశాల నుంచి టీకాల కొనుగోలుపై కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
2020 ఏడాది మధ్య నుంచి ప్రధాన అంతర్జాతీయ టీకా తయారీదారులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి.
విదేశాల్లో అందుబాటులో ఉన్న టీకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వట్లేదు.
అమెరికా ఎఫ్‌డీఏ, ఐరోపా, యూకే నియంత్రణ సంస్థలు అనుమతించిన టీకాలు దేశంలోకి సులభంగా వచ్చేలా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. ఈ టీకాలు భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టాల్సిన అవసరం లేదు. ఇతర దేశల్లో సమర్థంగా పనిచేస్తున్న వాక్సిన్లకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాం. విదేశీ టీకా సంస్థలకు సంబంధిన ఏ అభ్యర్థన డీసీజీఐ వద్ద పెండింగ్‌లో లేదు.
దేశీయ వాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఎక్కువ సంస్థలు వాక్సిన్ ఉత్పత్తి చేసేలా చూసేందుకు కేంద్రం 2020 నుంచి పనిచేస్తోంది. టీకా మేధో సంపత్తి హక్కులు ఉన్న ఏకైక సంస్థ భారత్ బయోటెక్. ఈ సంస్థ ప్లాంట్లు ఒకటి నుంచి నాలుగుకు చేరాయి. ఇది కాకుండా మరో మూడు సంస్థలు కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకున్నాం.
తప్పనిసరి లైసెన్సింగ్‌ను కేంద్రం తొలగించాలి.
టీకా ఉత్పత్తికి తప్పనిసరి లైసెన్సింగ్ అనేది సమస్య కాదు. వ్యాక్సిన్ ఉత్పత్తి అనేది ప్రధానంగా 'ఫార్ములా' మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం శిక్షణ, మానవ వనరులు, ముడి పదార్థాలు, మెరుగైన భాగస్వామ్యం, బయో సేఫ్టీ ఉన్న లాబ్‌లు అవసరం. సాంకేతికత బదిలీ అనేది కంపెనీల చేతిలో ఉంటుంది.
కేంద్రం తన బాధ్యతను రాష్ట్రాలకు వదిలేసింది.
టీకా తయారీదారులు తమ ఉత్పత్తిని పెంచేందుకు భారీగా ఆర్థిక సాయం చేస్తున్నాం. విదేశీ టీకాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకారం అందిస్తున్నాం. కేంద్రం కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా ఇస్తున్నాం. టీకాలను కొనుగోలు చేసే అనుమతి మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చాం. దేశంలో టీకా ఉత్పత్తికి సంబంధించిన ప్రతి సమస్య రాష్ట్రాలకు తెలుసు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు పరిస్థితిని కేంద్రం బాగానే నడిపించింది. కానీ వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలకు కనీస కవరేజీ ఇవ్వలేని రాష్ట్రాలు టీకా ప్రక్రియను సరళతరం చేయాలని కోరాయి. మరింత వికేంద్రీకరణ కోరుకున్నాయి. గ్లోబల్ టెండర్లు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రపంచంలో వ్యాక్సిన్లకు కొరత ఉంది. తక్కువ సమయంలో టీకా కొనుగోలు అంత సులభతరం కాదని రాష్ట్రాలకు ముందు నుంచే చెప్పాం.
రాష్ట్రాలకు తగినన్ని టీకాలను కేంద్రం ఇవ్వడం లేదు.
పారదర్శక విధానం ద్వారా, మార్గదర్శకాలను అనుసరించే టీకా పంపిణీ చేపట్టాం. టీకా లభ్యత గురించి రాష్ట్రాలకు ముందుగానే చెబుతున్నాం. సమీప భవిష్యత్తులో టీకా లభ్యత పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి కాకుండా మిగిలిన టీకాల్లో 25 శాతం రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు పొందనున్నాయి.
చిన్నారులకు టీకా పంపిణీపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ప్రస్తుతానికి ఏ దేశం కూడా పిల్లలకు టీకా ఇవ్వడం లేదు. డబ్ల్యూహెచ్ఓ సైతం దీన్ని సిఫార్సు చేయలేదు. పిల్లలపై టీకాలు సురక్షితంగా ఉన్నాయని వివిధ పరిశోధనల్లో తేలింది. త్వరలో భారత్‌లోనూ ట్రయల్స్ ప్రారంభమవుతాయి. పిల్లలకు టీకా ఇవ్వడం అనేది సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల ఆందోళనలపై ఆధారపడి ఉండదు. ట్రయల్స్ డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి-టీకా వద్దంటూ పొదల్లో దాక్కున్న వృద్ధురాలు