దేశంలో కొవిడ్ విజృంభణకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణే కారణమంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది ఎన్నికల సంఘం. కొవిడ్-19 నిర్వహణ తమ పని కాదని, రాష్ట్ర పరిపాలనను తాము సాగించలేమని సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఎన్నికల సంఘంపై మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసీ తరఫున న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. మద్రాస్ హైకోర్టు ఒక రాజ్యాంగ సంస్థపై అనవసరంగా హత్యానేరం వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈసీ వివరణ తెలుసుకోకుండా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అభిప్రాయపడ్డారు.
" రాష్ట్రంలో ఎన్నికల సంఘం పరిపాలన సాగించదు. మేము కేవలం మార్గదర్శకాలు ఇస్తాం. ర్యాలీల్లో ప్రజలను తనిఖీ చేసేందుకు మా వద్ద సీఆర్పీఎఫ్ వంటి ఏ ఇతర బలగాలు లేవు. ప్రజలను నియంత్రించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు ఇస్తుంది. వాటన్నింటికీ ఈసీదే బాధ్యతగా భావిస్తున్నారు. కొవిడ్ నిర్వహణపై మేము ఏమీ చేయలేం."
- రాకేశ్ ద్వివేది, ఈసీ తరఫు న్యాయవాది.
హైకోర్టు వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని ద్వివేదికి సూచించింది ధర్మాసనం. 'ఎవరూ ఎవరిని విమర్శించరు. మీరు మంచి పని చేశారు. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగ సంస్థ. దేశంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించటమే ఆ సంస్థ విధి. రాజ్యాంగ సంస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం హైకోర్టు వ్యాఖ్యల్లో లేదు. చర్చిస్తున్న సందర్భంలో సమయానుసారం వచ్చింది. అందుకే జుడీషియల్ ఆర్డర్స్‌లో ఆ వ్యాఖ్యలు లేవు' అని ధర్మాసనం తెలిపింది.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు..
హైకోర్టులు ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల వంటివని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి వ్యాఖ్యలను సరైన విధానంలో పరిగణించాలని పేర్కొంది. న్యాయమూర్తులు ఏవైనా వ్యాఖ్యలు చేస్తే.. అవి ప్రజలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. ఆదేశాలు ఉల్లంఘిస్తే ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని తెలిపింది. మరోవైపు.. హైకోర్టు వ్యాఖ్యలను మీడియా ప్రసారం చేయకుండా ఆపడం కుదరదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర శక్తిమంతమైనదన్న ధర్మాసనం న్యాయస్థానాల్లో జరిగే విచారణను రిపోర్టు చేయకుండా ఆపలేమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చూడండి:'ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి'