భారత్ ఇతర దేశాలకు అందించిన సాయం స్నేహం, మద్దతును దృష్టిలో పెట్టుకుని చేసినదని విదేశాంగ మంత్రి జయ్శంకర్ పేర్కొన్నారు. మందులు, వ్యాక్సిన్ల పంపిణీ ద్వారా భారత్ ఇదివరకు విదేశాలకు సాయపడిందని.. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో ఆ దేశాలు భారత్కు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచ సమస్య అని.. దీనిని అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
"గతేడాది పలు అమెరికా, ఐరోపా సహా పలు దేశాలకు గతేడాది వైద్య పరికరాలు, ఔషధాలు పంపిణీ చేశాము. ఇవి స్నేహపూర్వకంగా ఇచ్చినవే కానీ ఆధిపత్యం చెలాయించడానికి కాదు. ప్రస్తుతం దేశంలో ప్రజలు రెండో దశ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు మా శక్తిమేరకు కృషి చేస్తాం."