టీకా విధానంలో వేర్వేరు డోసుల సమర్థత ఇంకా శాస్త్రీయంగా రుజువు కానందున ప్రస్తుతానికి వ్యాక్సిన్ మిక్సింగ్ అనే ప్రశ్నే లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక, కొవిషీల్డ్ కూడా సింగిల్ డోసు కాదని, రెండు డోసులు వేయించుకోవాల్సిందేనని వెల్లడించింది. "కొవిషీల్డ్ రెండు డోసుల టీకా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. డోసుల వ్యవధిలోనూ మార్పు ఉండదు. తొలి డోసు వేసుకున్న 12 వారాల తర్వాతే కొవిషీల్డ్ రెండో డోసు తీసుకోవాలి. ఇక వ్యాక్సిన్ వేర్వేరు డోసుల మిక్సింగ్ విషయానికొస్తే.. శాస్త్రీయంగా నిరూపణ అయ్యేంతవరకు దీన్ని అనుసరించకూడదు. ప్రస్తుతానికి తొలి డోసులో వేయించుకున్న వ్యాక్సిన్నే రెండో డోసులో కూడా తీసుకోవాలి" అని ఆరోగ్యశాఖ వివరించింది. వేర్వేరే టీకా డోసులు, కేవలం సింగిల్ డోసు టీకాలంటూ గత కొద్ది రోజులుగా మీడియా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
జులై నాటికి రోజుకు కోటిమందికి టీకా
ఇక ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత లేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. జులై మధ్య నాటికి లేదా ఆగస్టుకు రోజుకు కోటి మందికి టీకాలు ఇచ్చేలా వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21.6 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, 2.42 కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు ఉన్నారు. 45ఏళ్లు పైబడినవారు 15.48కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 18-44 ఏళ్ల వారిలో 2.03 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
6.62 శాతానికి పాజిటివిటీ రేటు..