కరోనాతో అల్లాడుతున్న భారత్కు విదేశాల నుంచి సాయం కొనసాగుతోంది. శనివారం రాత్రి జర్మనీ నుంచి 120 వెంటిలేటర్లు న్యూదిల్లీకి చేరుకున్నాయి. మానవతా దృక్పథంతో జర్మనీ ఈ సహాయం చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.
త్వరలోనే ఓ మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ను జర్మనీ పంపించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 13 మంది జర్మన్ నిపుణులు ఇప్పటికే భారత్కు వచ్చారని వెల్లడించాయి. రెమ్డెసివిర్, మోనోక్లోనల్ ఔషధాలు త్వరలో రానున్నట్లు వివరించాయి. వైరస్ జన్యుక్రమంపై భారతీయ నిపుణులతో జర్మన్ ఏజెన్సీ ఓ వెబినార్ నిర్వహించనుందని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
అదేసమయంలో, ప్రైవేటు సంస్థలు సైతం జర్మన్ కంపెనీల నుంచి పలు పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. లిండే సంస్థ నుంచి టాటా కంపెనీ 24 ఆక్సిజన్ ట్యాంకులను కొనుగోలు చేసిందని చెప్పారు. అల్బట్రాస్ సంస్థ నుంచి ఆయిల్ ఇండియా కార్పొరేషన్ నాలుగు ట్యాంకులను దిగుమతి చేసుకుందని వెల్లడించారు.
అగ్రరాజ్యం ఆపన్నహస్తం
అమెరికా నుంచి మరో సహాయక విమానం భారత్కు వచ్చింది. వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, రెగ్యులేటర్లు, ఇతర వైద్య పరికరాలను అగ్రరాజ్యం పంపించింది. ఇది.. రెండు రోజుల వ్యవధిలో అమెరికా నుంచి వచ్చిన మూడో విమానం కావడం విశేషం. ఈ సందర్భంగా అమెరికా అందిస్తున్న గొప్ప సహకారానికి కృతజ్ఞత వ్యక్తం చేసింది భారత విదేశాంగ శాఖ.