Covaxin ICMR: కొవాగ్జిన్ రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌కు గురైనవారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు అత్యంత అధిక స్థాయిలో ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఆందోళనకర వేరియంట్లు అయిన బీటా, డెల్టా, ఒమిక్రాన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొవాగ్జిన్ టీకా దోహదపడుతున్నట్టు తేలింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యాన పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డా. ప్రగ్యా యాదవ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఒమిక్రాన్ కారణంగా దేశంలో మూడో దశ కొవిడ్ ఉద్ధృతి నెలకొనడం వల్ల కొవాగ్జిన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఈ అధ్యయనం సాగించారు. వివిధ వయసుల వారిలో ఈ టీకా పనితీరు, రెండు డోసులు తీసుకున్న తర్వాత ఇన్ ఫెక్షన్ సోకినవారిలో రోగనిరోధక స్పందనలు ఎలా ఉన్నాయన్నది పరిశోధకులు నిశితంగా అధ్యయనం చేశారు.
సగటున రెండో డోసు తీసుకున్న 43 రోజుల తర్వాత బ్రేక్ త్రూ కేసులు నమోదవుతున్నట్టు లెక్కగట్టారు. ఇలాంటి 95 శాతం కేసుల్లో లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటున్నాయని, కొందరిలో అసలు లక్షణాలే ఉండటం లేదని గుర్తించారు. రెండు డోసుల తర్వాత కొవిడ్‌కు గురైన వారిలో అన్నిరకాల ఆందోళనకర వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొనేలా హెచ్చుస్థాయి రోగనిరోధక ప్రతిస్పందనలు కనిపించినట్టు వారు గుర్తించారు. కొవిడ్‌కు గురైన తర్వాత కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారిలోనూ రోగనిరోధక శక్తి అధిక స్థాయిలో ఉంటున్నట్టు అధ్యయనంలో తేలింది. రెండో డోసు తీసుకున్న మూడు నెలల తర్వాత టీకా కారణంగా లభించే రోగనిరోధకశక్తి క్రమంగా తగ్గుతోందని.. బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా ఆందోళనకర వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్ఫెక్షన్ పత్రిక అందించింది.