కరోనా నిరోధక టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించింది. కరోనాను నివారించడంలో కొవాగ్జిన్ మధ్యంతర క్లినికల్ సామర్థ్యం 81 శాతమని ఆ సంస్థ వెల్లడించింది. యూకే రకం కరోనా వైరస్‌పై కూడా కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
మరింత సమాచారంతో పాటు తుది విశ్లేషణ చేయడానికి కావాల్సిన 130 కేసులు నిర్ధరణ అయ్యే వరకు టీకాపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. మొదటి, రెండు, మూడు దశ క్లినికల్ ట్రయల్స్ 27 వేల మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించామని.. మూడో దశలోనే 25,800 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించామని భారత్ బయోటెక్ పేర్కొంది. గతంతో పోలిస్తే మూడో దశలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇది దేశంలోనే ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ అని పేర్కొంది. తద్వారా టీకా సామర్థ్యాన్ని స్పష్టంగా చెప్పవచ్చని వెల్లడించింది.