కొవిడ్‌పై పోరులో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనమొకటి తేల్చింది. వైరస్‌కు వ్యతిరేకంగా మంచి రోగ నిరోధకతను అవి ఉత్పత్తి చేస్తున్నాయని నిర్ధారించింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 22 నగరాల్లో 515 మంది ఆరోగ్యరంగ సిబ్బందిపై తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. వారిలో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు 90 మంది. మిగిలిన 425 మంది- కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్నవారు.
అహ్మదాబాద్‌లోని విజయ్‌రత్న డయాబెటిక్ సెంటర్, కోల్‌కతాకు చెందిన జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇన్‌స్టిట్యూట్, జైపుర్‌లోని మహాత్మాగాంధీ వైద్య కళాశాల ఆస్పత్రి తదితర ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు ఇందులో పాలుపంచుకున్నారు. టీకా వేసుకున్నాక ఏ స్థాయుల్లో యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి? వాటి ఉత్పత్తిని ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? వంటి అంశాలను వారు పరిశీలించారు. ఈ అధ్యయన నివేదిక ప్రకారం.. రెండో డోసు పూర్తయ్యాక కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ మంచి రోగ నిరోధక సామర్థ్యాన్ని చేకూర్చాయి.
వారిలో ఎక్కువ..
కొవాగ్జిన్‌తో పోలిస్తే కొవిషీల్డ్ గ్రహీతల్లో యాంటీబాడీ స్థాయులు ఎక్కువగా కనిపించాయి. రెండో డోసు పూర్తయ్యాక 95% మందిలో సీరోపాజిటివిటీ (యాంటీబాడీల ఉత్పత్తి) కనిపించింది. కొవిషీల్డ్ తీసుకున్నవారిలో 98.1%గా, కొవాగ్జిన్ వేసుకున్నవారిలో 80%గా అది నమోదైంది. 60 ఏళ్లు పైబడినవారితో పోలిస్తే.. అంతకంటే తక్కువ వయసున్నవారిలో సీరోపాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది. స్త్రీ/పురుషుడు అన్న తేడా, శరీర ద్రవ్యసూచీ (బీఎంఐ), ఇతర అనారోగ్యాల వంటి కారకాలు వ్యక్తుల్లో యాంటీబాడీల ఉత్పత్తిని ప్రభావితం చేయలేదు.