రాజ్యాంగం ప్రవచించిన సమ్మిళిత ఆదర్శాన్ని చేరుకోవాలంటే భారత న్యాయవ్యవస్థలో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరగాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు, హైకోర్టులలో కలిపి వీరి ప్రాతినిధ్యం 12శాతం కన్నా తక్కువగా ఉందని తెలిపారు. స్వల్ప ఖర్చుతో అందరికీ న్యాయం అందేలా చూడాలని, సాధారణ ప్రజలు అర్థం చేసుకొనే భాషలో తీర్పులు వెలువరించాలని సూచించారు. ఆయన శనివారం ప్రయాగ్‌రాజ్‌లో (అలహాబాద్) ఉత్తర్‌ప్రదేశ్ జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం, అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో కొత్త భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు.
"దేశంలో అతిపెద్దదైన అలహాబాద్ హైకోర్టుకు ఎంతో చరిత్ర ఉంది. దేశంలో తొలి మహిళా న్యాయవాది కార్నెలియా సొరాబ్జీ 1921లో ఇక్కడే నమోదయ్యారు. మహిళా సాధికారత దిశలో ఈ హైకోర్టు ఎన్నో నిర్ణయాలు తీసుకొంది. చరిత్రలో ఇదివరకు ఎన్నడూలేని విధంగా గత నెలలో సర్వోన్నత న్యాయవ్యవస్థలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించాం. సుప్రీంకోర్టుకు నియమించిన తొమ్మిది మంది కొత్త న్యాయమూర్తుల్లో ముగ్గురు అతివలకు అవకాశం కల్పించాం. వీరిలో ఒకరు భవిష్యత్తులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే వీలుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న 33 మంది న్యాయమూర్తుల్లో నలుగురు వారే ఉండటం చరిత్రలో ఇదే తొలిసారి. అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యం పెరిగినప్పుడే న్యాయబద్ధమైన సమాజం ఏర్పాటు సాధ్యమవుతుంది."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
"న్యాయం పొందడానికి పేదలు పడే కష్టాలను నేను చాలా దగ్గరి నుంచి చూశాను. తక్కువ ఖర్చుతో పేదలు సకాలంలో న్యాయం పొందేలా చూడాలి. సాధారణ ప్రజలు అర్థం చేసుకొనే భాషలో నిర్ణయాలు వెలువరించాలి. మరీ ముఖ్యంగా బలహీనవర్గాలు, మహిళలకు సత్వర న్యాయం చేయాలి" అని రామ్‌నాథ్ సూచించారు.
త్వరలో మధ్యవర్తిత్వ న్యాయ బిల్లు
వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో మధ్యవర్తిత్వ న్యాయ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ విక్రమ్‌నాథ్, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్‌నాథ్ భండారీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.