బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడే క్రిమినల్ కేసుల్లో అనుమానితులకు కోర్టులు సమన్లు(court summons) ఇవ్వాలని సుప్రీంకోర్టు(supreme Court) తెలిపింది. నేర శిక్షా స్మృతి (సీఆర్‌పీసీ)లోని 319 సెక్షన్ ప్రకారం అనుమానితులకు సమన్లు పంపించే విషయమై న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. కేసులో నిందితుడు కానప్పటికీ, నేరం చేశాడేమోనన్న అనుమానంతో సమన్లు ఇవ్వాలంటే దృఢమైన, విశ్వసనీయమైన ఆధారాలు ఉండాలని తెలిపింది. అంతేతప్ప యథాలాపంగానో, అధికార దర్పంతోనో ఇవ్వకూడదని పేర్కొంది. విచారణ జరుగుతున్నప్పుడుగానీ, దర్యాప్తులో భాగంగాగానీ ఎవరిపైనైనా అనుమానం వచ్చినప్పుడు వారికి ఇష్టం వచ్చిన రీతిలో సమన్లు ఇవ్వకూడదని తెలిపింది.
'తగిన సాక్ష్యాలు ఉంటేనే అనుమానితులకు సమన్లు' - సుప్రీంకోర్టు తాజా సమాచారం
కేసులో నిందితుడు కానప్పటికీ, నేరం చేశాడేమోనన్న అనుమానంతో సమన్లు(court summons) ఇవ్వాలంటే దృఢమైన, విశ్వసనీయమైన సాక్ష్యాలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేగాని విచారణ జరుగుతున్నప్పుడుగానీ, దర్యాప్తులో భాగంగా గానీ ఎవరిపైనైనా అనుమానం వచ్చినప్పుడు వారికి ఇష్టం వచ్చిన రీతిలో సమన్లు ఇవ్వకూడదని పేర్కొంది.
2014లో రాజ్యాంగ ధర్మాసనం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేసింది. 2015లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కారు డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు యజమాని రమేష్ చంద్ర శ్రీవాస్తవకు ట్రయల్ కోర్టు సమన్లు పంపించింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ అనుకూలంగా నిర్ణయం రాకపోవడం వల్ల సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం ఈ నెల 30న కేసును మళ్లీ పరిశీలించాలని ఖిరి సెషన్స్ జడ్జిని ఆదేశించింది. సమన్లు ఇవ్వడానికి తగిన ఆధారాలు ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి:'చట్టసభలకు అంతరాయం కలిగించడం సభా ధిక్కరణే'