సాంకేతికత కారణంగా భవిష్యత్‌లో కోర్టు గదులు, కోర్టు కాంప్లెక్సులు చిన్నవిగా మారిపోబోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అన్నారు. న్యాయవ్యవస్థకు కరోనా వైరస్ సవాళ్లు విసిరినప్పటికీ కోర్టు గదులు ఆధునికీకరణ సంతరించుకోవాలన్న మార్గం చూపిందని చెప్పారు. బాంబే హైకోర్టు బెంచ్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ-ఫైలింగ్‌తో మేలు..
రవిశంకర్ ప్రసాద్ మంత్రిత్వ శాఖ(ఐటీ శాఖ అనే ఉద్దేశంలో) వల్ల భవిష్యత్‌లో కోర్టు గదులు చిన్నవిగా మారబోతున్నాయని జస్టిస్ బోబ్డే అన్నారు. ఈ-ఫైలింగ్ వల్ల పేపర్లను భద్రపరచడానికి పెద్ద పెద్ద గదుల అవసరం ఉండబోదని చెప్పారు. అదే సమయంలో ప్రస్తుతమున్న కోర్టు గదులను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ఆ దిశగా మార్గదర్శనం చేసిందన్నారు. ముంబయిలోని బాంబే హైకోర్టుకు కూడా నూతన భవనాల అవసరం ఉందని ప్రస్తావించారు. కేవలం ఏడుగురు న్యాయమూర్తుల కోసం నిర్మించిన భవనంలో ఇప్పుడు 40 మంది సేవలందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:'మహిళల పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది'