Court Verdict After 49 Years :49 ఏళ్ల నాటి కేసులో ఎట్టకేలకు తీర్పునిచ్చింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ కోర్టు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం ఓ మహిళను కాల్చి చంపిన కేసులో.. 80 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చింది. అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పును ఇచ్చింది.
బాధితురాలి తరఫున లాయర్ చెప్పిన వివరాల ప్రకారం.. మహేంద్ర సింగ్ అనే వ్యక్తి నార్ఖీ ప్రాంతంలో నివసించేవాడు. అతడు 1974 సెప్టెంబర్ 14న రామ్బేటీలోని ఓ మహిళను ఆమె భర్త వద్దనున్న రైఫిల్ తీసుకుని కాల్చి చంపాడు. అనంతరం ఆమె కుమార్తె మీరా దేవీ.. మహేంద్ర సింగ్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అప్పుడు నార్ఖీ.. ఆగ్రా కోర్టు పరిధిలో ఉండడం వల్ల.. అక్కడ చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉంది. కొంత కాలం క్రితం ఆ కేసు ఫిరోజాబాద్‌కు బదిలీ అయింది.
దీంతో జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ గవర్నమెంట్ కౌన్సిల్- ఏడీజీసీ శ్రీనారాయణ్ శర్మ ఈ కేసులో విచారణ చేపట్టారు. అయితే విచారణ సమయంలో పలు వాంగ్మూలాలను, అధారాలను న్యాయమూర్తి ముందు ఉంచామని బాధితురాలి తరఫున న్యాయవాది తెలిపారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు మహేంద్ర సింగ్‌ను దోషిగా తేల్చుతూ జీవిత ఖైదు శిక్ష వేస్తూ తీర్పు వెలువరించిందని చెప్పారు. దీంతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించిందని.. అవి చెల్లించకుంటే మరో ఏడాది శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించిందని వెల్లడించారు.