Lalu Yadav Fodder scam: దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తున్నట్లు సోమవారం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. అనంతరం ఆయన్ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS)కు తీసుకెళ్లారు.
దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది. ఈ కేసులో మొత్తం 170 మంది నిందితులు కాగా.. 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వం తరఫున సాక్షులుగా మారారు. ఇద్దరు నేరం అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. చివరకు లాలూ సహా మొత్తం 99 మంది నిందితులపై ఫిబ్రవరి నుంచి విచారణ జరిపింది రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
తేజస్వీ యాదవ్ స్పందన..
తన తండ్రికి కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడంపై తానేమీ మాట్లాడనని తెలిపారు తేజస్వీ యాదవ్. హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసినట్లు వెల్లడించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
" దేశంలో దాణా స్కామ్ మినహా మరే ఇతర కుంభకోణం జరగనట్లు భ్రమ కల్పిస్తున్నారు. బిహార్‌లో దాదాపు 80 స్కామ్‌లు జరిగాయి. వాటి విషయంలో సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ ఏమయ్యాయి? ఈ దేశంలో ఒక్కరే లీడర్, ఒక్కటే స్కామ్ ఉందా? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీని సీబీఐ మరచిపోయింది. లాలూ భాజపాతో చేతులు కలిపి ఉంటే ఆయన్ను రాజా హరిశ్చంద్ర అనే వారు. కానీ ఆయన అలా చేయకుండా భాజపా-ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అందుకే జైలుకు వెళ్తున్నారు. ఇలాంటి చర్యలతో మేం భయపడే ప్రసక్తే లేదు."