BJP Files Defamation On Congress : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు పరువు నష్టం కేసులో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు సహా కర్ణాటక కాంగ్రెస్ కమిటీ-కేపీసీసీపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంగళవారం ఈమేరకు చర్యలు చేపట్టింది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బెంగళూరులోని అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ ఈ కేసు వేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి క్రిమినల్ కేసులను పరిష్కరించే ప్రత్యేక న్యాయస్థానం.. ఐపీసీ సెక్షన్ 499(పరువు నష్టం), 500(పరువు నష్టం కలిగించినందుకు శిక్ష)కు సంబంధించిన సెక్షన్ల కింద బీజేపీ చేసిన ఆరోపణల్ని పరిగణనలోకి తీసుకుంది. రాహుల్ సహా ఇతర నేతల వాంగ్మూలం నమోదు చేసేందుకు వారికి సమన్లు జారీ చేసింది. కేసు విచారణను జులై 27కు వాయిదా వేసింది.
కేసు ఏమిటి?
కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. గత బీజేపీ ప్రభుత్వంపై 40% కమీషన్ సహా మరికొన్ని అవినీతి ఆరోపణలు చేస్తూ మే 5న వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కేశవ ప్రసాద్ మే 9న కేసు నమోదు చేశారు.