తన భార్యపై అత్యాచారం చేసినందుకు ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. పెళ్లి కాక ముందు మైనర్‌గా ఉన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడినందుకు ఒడిశాలోని ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ఈ శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళ్తే...
ఒడిశా అంగుల్ జిల్లాకు చెందిన గోబర్ధన్ నాయక్.. బనర్పల్ ప్రాంతానికి చెందిన మైనర్‌పై 2016లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలిక 2021 జనవరిలో తన తల్లిదండ్రులతో కలిసి గోబర్ధన్పై పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
గోబర్ధన్ నాయక్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం అతన్ని జైలు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన గోబర్ధన్ నాయక్ గత సంవత్సరం జూలైలో.. మేజర్ అయిన బాధితురాలిని పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా కేసు విచారణ పూర్తి కాగా.. జిల్లా కోర్టు న్యాయమూర్తి.. గోబర్ధన్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇలాంటి నేరాలు పిల్లల మనసులో చెరగని ముద్ర వేస్తాయని పేర్కొన్న న్యాయమూర్తి.. దోషికి రూ.10వేల జరిమానా సైతం విధించారు. గోబర్ధన్ నాయక్ తరపు న్యాయవ్యాది రబీంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తు తాము ఒరిస్సా హైకోర్టుకు వెళుతున్నట్లు తెలిపారు.