Amravati Chemist Umesh Kolhe: అమరావతిలోని కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాద్‌రావు కోల్హే హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న ఇర్ఫాన్ ఖాన్‌కు.. జులై 7 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. ఈ కేసులో ఏడో నిందితుడిగా అరెస్టయ్యాడు షేక్ ఇర్ఫాన్ షేక్ రహీం అలియాస్ ఇర్ఫాన్ ఖాన్. నాగ్‌పుర్‌లో శనివారం ఇతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆదివారం కోర్టులో ప్రవేశపెట్టారు.
ఇర్ఫాన్ ఖాన్ ఓ ఎన్జీఓ డైరెక్టర్ అని, ఆ స్వచ్ఛంద సంస్థ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముదాసర్ అహ్మద్ అలియాస్ సోను రజా షేక్ ఇబ్రహీం (22), షారుక్ పఠాన్ అలియాస్ బాద్షాషా హిదాయత్ ఖాన్ (25), అబ్దుల్ తౌఫిక్ అలియాస్ నాను షేక్ తస్లీమ్ (24), షోయబ్ ఖాన్ అలియాస్ భూర్య సబీర్ ఖాన్ (22), అతిబ్ రషీద్ ఆదిల్ రషీద్ (22), డా. యూసుఫ్ ఖాన్ బహదూర్ ఖాన్‌ను (44) అరెస్టు చేశారు. ఇందులో నలుగురు ఇర్ఫాన్ ఖాన్ స్నేహితులు. వీరంతా.. అతడి ఎన్జీఓ కోసమే పనిచేస్తున్నట్లు తెలిసింది. అరెస్టైన వారిలో ఒకరైన యూసుఫ్ ఖాన్ వెటర్నరీ డాక్టర్.. చనిపోయిన కోల్హే వెటర్నరీ మెడికల్ షాప్ ఓనర్. ఈ ఇద్దరికీ వ్యాపార సంబంధాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు.
ఆ పోస్టుతోనే? సోషల్ మీడియాలో వెటర్నరీ డాక్టర్స్ గ్రూప్‌ను క్రియేట్ చేశారు కోల్హే. యూసుఫ్ ఖాన్ కూడా ఇందులో ఓ సభ్యుడిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమేశ్ కోల్హే.. నుపుర్ శర్మకు మద్దతుగా ఆ గ్రూప్‌లో పోస్ట్ చేయగా.. కొందరికి ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే యూసుఫ్ ఖాన్ హత్యకు కుట్ర పన్ని.. మిగతా వారిని ప్రేరేపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. యూసుఫ్ ఖాన్, ఉమేశ్ కోల్హే మంచి స్నేహితులు అని.. కోల్హే అంత్యక్రియలకు కూడా యూసుఫ్ ఖాన్ హాజరయ్యారని వెల్లడించారు.