YS Bhaskar Reddy, Udaykumar Reddy Judicial remand Extend: వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు సీబీఐ కోర్టు వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరినీ సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అధికారులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని గత నెల 14న, భాస్కర్ రెడ్డిని 16వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరినీ సీబీఐ అధికారులు 6రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై సీబీఐ అధికారులు దాఖలు చేసిన కౌంటర్‌పైనా వాదనలు ముగిశాయి.
సీబీఐ కౌంటర్ పిటిషన్..ఉదయ్ కుమార్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసని సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన విషయం బయటకు తెలియక ముందే ఉదయ కుమార్ రెడ్డికి తెలిసిపోయిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పిన తర్వాత వెంటనే వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. వైఎస్ వివేకా హత్య జరిగిన ఘటనాస్థలానికి అవినాష్ రెడ్డితో కలిసి వెళ్లి హత్యకు సంబందించిన.. ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడని సీబీఐ అధికారులు కౌంటర్ పిటిషన్లో వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కంపౌండర్‌గా పనిచేసే తన తండ్రిని పిలిచి వివేకా తలకు కుట్లు వేయించినట్లు సీబీఐ అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు.. వివేకా హత్యకు సంబంధించిన కేస్ డైరీని ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.