తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాస్త్రీయంగానే పిల్లల వ్యాక్సినేషన్‌!: సుప్రీం కోర్టు

Supreme Court: పిల్లల వ్యాక్సినేషన్‌ సురక్షితమేనని నిపుణులు తేల్చిన తర్వాత ఈ విషయమై తాము నిర్ణయం చెప్పలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 15-18 ఏళ్ల వారికి ఇప్పటికే అందించిన టీకాలు, అనంతర విశ్లేషణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా కూడా వ్యాక్సిన్‌ వల్ల పిల్లలకు ఎలాంటి ముప్పు ఉండదనే చెబుతోందని పేర్కొంది. ఈ మేరకు అశాస్త్రీయత ప్రాతిపదికన పిల్లల వ్యాక్సినేషన్‌ విషయంలో జోక్యం చేసుకోవాలన్న పిటిషనర్‌ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

paediatric vaccination
supreme court

By

Published : May 4, 2022, 5:58 AM IST

Updated : May 4, 2022, 6:31 AM IST

Supreme Court: పిల్లల వ్యాక్సినేషన్‌ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించి చెప్పిన తర్వాత ఆ విషయంపై తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు పేర్కొంది. పిల్లలకు టీకాతో ఎలాంటి ముప్పు లేదన్న విషయాన్ని కూడా డేటా తెలుపుతోందని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

"టీకా సురక్షిత, అనుబంధ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు శాస్త్రీయంగా నిపుణుల్లో భిన్నాభిప్రాయాలుండొచ్చు. కానీ ప్రభుత్వ విధానాల ప్రాతిపదికన నిపుణుల అభిప్రాయంపై న్యాయస్థానం నిర్ణయం వెలువరించలేదు" అని ధర్మాసనం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌, సీడీసీ వంటి సాధికార సంస్థలు కూడా పిల్లల వ్యాక్సినేషన్‌ను సూచించినట్లు తెలిపింది. 15-18 ఏళ్ల వారికి ఇప్పటికే అందించిన టీకాలు, అనంతర విశ్లేషణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా కూడా వ్యాక్సిన్‌ వల్ల పిల్లలకు ఎలాంటి ముప్పు ఉండదనే చెబుతోందని పేర్కొంది. టీకాకు సంబంధించిన ప్రయోగపరీక్షలు కూడా శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగానే సాగిన విషయాన్ని ప్రస్తావించింది. ఈమేరకు అశాస్త్రీయత ప్రాతిపదికన పిల్లల వ్యాక్సినేషన్‌ విషయంలో జోక్యం చేసుకోవాలన్న పిటిషనర్‌ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. 'ఎన్‌టాగీ' మాజీ సభ్యుడు డాక్టర్‌ జాకబ్‌ పులియెల్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈమేరకు తీర్పును వెలువరించింది.

తప్పుడు సమాచారం ఇచ్చిన ఉద్యోగిని ఏకపక్షంగా తొలగించలేరు!

ఓ ఉద్యోగి నియామకం సమయంలో ఏదైనా విషయాన్ని దాచిపెట్టడం లేదా తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం అంటే.. యాజమాన్యం అతన్ని ఏకపక్షంగా తొలగించేయమని అర్థం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే నియామకం కోరే అభ్యర్థి తన వ్యవహారశైలి, పూర్వ ప్రవర్తనకు సంబంధించి ధ్రువీకరణ పత్రంలో ఎప్పుడూ వాస్తవ సమాచారాన్నే అందించాలని జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈమేరకు గతంలో రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ పోస్టుకు ఎంపికైన పవన్‌ కుమార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. అతను ఉద్యోగంలో చేరకముందు తనపై ఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయాన్ని దాచిపెట్టడం వల్ల.. శిక్షణలో ఉన్న సమయంలో (2015లో) అతన్ని తొలగిస్తూ అధికార యంత్రాంగం ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన లేదా ఏదైనా విషయాన్ని దాచిపెట్టిన వ్యక్తికి నియామకాన్ని కోరే లేదా సర్వీసులో కొనసాగించాలని అడిగే అపరిమితమైన హక్కేమీ ఉండదని.. అయితే ఏకపక్షంగా వ్యవహరించకుండా కోరే కనీస హక్కు ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి అన్ని అంశాలనూ పరిశీలించి, సర్వీసు నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటూ తగిన చర్యలు చేపట్టే విషయాన్ని యాజమాన్యానికే వదిలిపెడుతున్నట్లు పేర్కొంది. ఆ ఉద్యోగిని తొలగిస్తూ ఇచ్చిన ఆదేశాలు, అనంతరం దీనిపై దిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు సరి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి:'కరోనా టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు'

Last Updated : May 4, 2022, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details