తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాత్రంతా ఆన్​లో గ్యాస్​ హీటర్​.. ఊపిరాడక భార్యాభర్తలు మృతి.. లండన్​లో కేరళ నర్సు హత్య

రాత్రంతా గ్యాస్​ హీటర్​ ఆన్​లో ఉండడం వల్ల ఊపిరాడక భార్యాభర్తలు మృతిచెందారు. వారి నాలుగు నెలల చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, బిహార్​లో సిగరెట్లు తీసుకున్న సాయుధులను డబ్బులు అడిగినందుకు పాన్​షాప్​ యజమానిపై కాల్పులు జరిపారు. కేరళకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా భర్త చేతిలో హత్యకు గురైంది.

COUPLE DIED DUE TO SUFFOCATION FROM GAS HEATER IN SAMBHAL
Etv COUPLE DIED DUE TO SUFFOCATION FROM GAS HEATER IN SAMBHAL

By

Published : Dec 17, 2022, 9:29 PM IST

Updated : Dec 17, 2022, 10:50 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో విషాదం నెలకొంది. రాత్రంతా గ్యాస్​ హీటర్​ ఆన్​లో ఉండడం వల్ల ఊపిరాడక ఇద్దరు దంపతులు మృతిచెందారు. వారి నాలుగు నెలల చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సంభల్​ జిల్లాలోని అక్రోలి గ్రామానికి చెందిన సల్మాన్​ స్థానికంగా మెడికల్ స్టోర్​ నిర్వహిస్తున్నాడు. తన భార్య, నాలుగు నెలల చిన్నారితో అదే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే శనివారం ఉదయం పది గంటల వరకు నిద్రలేవకపోవడం వల్ల కింద ఇంటిలో ఉన్న బంధువులకు అనుమానం వచ్చింది. పైకి వెళ్లి చూసేసరికి లోపల తాళం వేసి ఉంది.

తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి చూడగా.. సల్మాన్​ దంపతులు, చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. గ్యాస్ ​హీటర్​ కూడా పూర్తిగా కాలిపోయి కనిపించింది. వెంటనే బంధువులు.. సల్మాన్​ దంపతులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. చిన్నారిని మరో ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సల్మాన్​ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ, ఇంతవరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

పాన్​షాప్​ యజమానిపై సాయుధుల కాల్పులు..
బిహార్​లో దారుణం జరిగింది. పాన్​షాప్​ యజమానిపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. దీంతో ఆ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని దిల్​ఖుష్​ కుమార్​గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెగూసరాయ్​ సిటీలో దిల్​ఖుష్​ పాన్​షాప్​ను నడుపుతున్నాడు. శనివారం కొందరు సాయుధులు అతడి దుకాణానికి సిగరెట్ల కోసం వచ్చారు. సిగరెట్లు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా తిరిగి వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వెంటనే దిల్​ఖుష్​ వారిని పిలిచి డబ్బులు అడిగాడు. దీంతో అతడిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత స్థానికులు.. దిల్​ఖుష్​ షాప్​నకు వెళ్లగా అతడు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వారంతా దిల్​ఖుష్​ దుకాణానికి అప్పుడప్పుడు వస్తుండేవారని స్థానికులు తెలిపారు.

లండన్​లో మలయాళీ నర్సు హత్య
కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ నర్సు.. తన ఇద్దరి పిల్లలతో సహా హత్యకు గురైంది. మహిళ భర్తే వారిని హతమార్చాడు. నిందితుడు.. మహిళతో పాటు ఇద్దరు చిన్నారులను ఊపిరాడకుండా చేసి చంపాడని లండన్​ పోలీసులు తెలిపారు.

కొట్టాయంకు చెందిన అశోకన్​ కుమార్తె అంజు.. భర్త, పిల్లలతో కలిసి లండన్​లో నివాసం ఉంటోంది. అంజు భర్త సాజు స్థానిక హోటల్​లో వెయిటర్​గా పనిచేసేవాడు. నాలుగు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి దారుణంగా ప్రవర్తించేవాడు. చిన్నచిన్న విషయాలకు కూడా గొడవపడేవాడు. చివరకు ఊపిరాడకుండా చేసి భార్యాపిల్లలను చంపేశాడు.
శుక్రవారం అంజుకు తన స్నేహితులు ఫోన్​ చేయగా.. రెస్పాన్స్​ లేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా.. అంజు, చిన్నారులు విగతజీవులై కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా.. సాజును అరెస్ట్​ చేశారు. విచారణలో చేసిన నేరాన్ని సాజు ఒప్పుకున్నాడు.

యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షల ఎక్స్​గ్రేషియా!
ఉత్తరాఖండ్​ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. యాసిడ్​ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి రూ.35 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించాలని తెలిపింది.

పిటిషనర్​ చెప్పిన వివరాల ప్రకారం..యాసిడ్​ దాడి బాధితురాలు.. 12వ తరగతి చదువుతున్న సమయంలో తనను ప్రేమించాలంటూ ఓ వ్యక్తి వేధించాడు. అతడు ప్రేమను ఆమె తిరస్కరించింది. దీంతో అతడు కోపం పెంచుకుని ఆమెపై యాసిడ్​ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె శరీరం 60 శాతానికి పైగా కాలిపోయింది. కుడి చెవి పూర్తిగా మూసుకుపోయింది.

వెంటనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపరిచారు. విచారణ జరిపిన కోర్టు.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది. బాధితురాలికి వైద్య సహాయం కింద రూ.1.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే తనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు నష్ట పరిహారంగా ఇవ్వాలని 2019లో హైకోర్టులో బాధితురాలు పిటిషన్​ వేసింది. సీనియర్ న్యాయమూర్తి సంజయ్ కుమార్ మిశ్రాతో కూడిన సింగిల్ బెంచ్‌.. ఆ పిటిషన్​పై విచారణ జరిపింది. ఆమెకు రాష్ట్రప్రభుత్వం రూ.35 లక్షల పరిహారాన్ని ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది.

రోడ్డు పక్కన నగ్నంగా యువకుడి మృతదేహం..
ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగరాజ్​లో నడిరోడ్డుపై నగ్నంగా ఓ యువకుడి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ప్రయాగ్​రాజ్​ జంక్షన్​.. గూడ్స్​ యార్డ్​ సమీపంలో గురువారం ఉదయం ఓ యువకుడు రైలుపైకి ఎక్కాడు. ఆ సమయంలో హైఓల్టేజీ వైర్​ తగిలి కిందపడిపోయాడు. వెంటనే అతడిని గమనించిన రైల్వే అధికారులు.. ప్లాట్​ఫామ్ ​మీదకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రైల్వే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడం వల్ల ఎస్​ఆర్ఎన్​ ఆస్పత్రికి షిఫ్ట్​ చేశారు.

అయితే శుక్రవారం ఉదయం బాధితుడి మృతదేహం రహదారి పక్కన పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం తరలించారు. మరణించిన యువకుడిని ఝార్ఖండ్​ నివాసి అయిన అమిత్ కుమార్​గా గుర్తించారు. అయితే ఎస్​ఆర్​ఎన్​ ఆస్పత్రి నుంచి యువకుడు బయటకు ఎలా వచ్చాడో తమకు తెలియదని రైల్వే అధికారులు తెలిపారు.

Last Updated : Dec 17, 2022, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details