Youngest Mayor Arya Rajendran marriage: దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా వార్తల్లోకెక్కిన ఆర్యా రాజేంద్రన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కేరళ అసెంబ్లీలో పిన్న వయసు ఎమ్మెల్యేగా ఉన్న సచిన్ దేవ్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. సచిన్ దేవ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వివాహ ప్రతిపాదనకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. నెల రోజుల్లోనే వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Arya Rajendran Sachin Dev
బలుస్సెరీ అసెంబ్లీ నియోజకవర్గానికి సచిన్ దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం మేయర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ముందు నుంచీ మంచి స్నేహితులు. బాలసంఘం, ఎస్ఎఫ్ఐలో పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా సీపీఎం తరఫున పోటీ చేశారు ఆర్య. 21 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎన్నికై.. దేశం దృష్టిని ఆకర్షించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సెక్రెటరీగా ఉన్న సమయంలో సచిన్ దేవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చింది సీపీఎం. 2021 ఎన్నికల్లో బలుస్సెరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి గెలుపొందారు. కోజికోడ్‌కు చెందిన సచిన్.. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ జాతీయ సంయుక్త కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి:వృద్ధుడిని మోస్తూ మంచులో 16.కి.మీ సాహస యాత్ర