తీవ్రవాదాన్ని అంతం చేసే దిశగా సార్క్ సభ్యదేశాలు ముందుకురావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. దక్షిణాసియాలోని ప్రజల శ్రేయస్సుకు కృషి చేస్తే సార్క్ సమూహం బలమైన శక్తిగా మారగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టకపోతే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి అది అడ్డుగోడగా మారుతోందని అన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను విడుదల చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
" పొరుగుదేశాలతో భారతదేశం స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడానికి ఆసక్తి కనబరుస్తోంది. శాంతి స్థాపనకు కృషి చేస్తోంది. కానీ దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా చుట్టూ ఉన్న దేశాల నుంచే సరిహద్దు సమస్యల రూపంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుంది. దీనిపై ఐక్యరాజ్యసమితి చురుకైన పాత్ర పోషించాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు బాసటగా నిలిచే దేశాలను వేరుచేయాలి. వారిపై ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేయాలి."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి