స్టాలిన్.. ఇప్పుడు దేశ ప్రజల్లో మారుమోగిపోతున్న పేరు. భాజపాకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలోని విపక్షాలకు కనపడిన మరో అస్త్రం. అయితే ఇదంతా ఒక్క రోజులో వచ్చింది కాదు! దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, నిరీక్షణ దాగి ఉంది. అదే ఇప్పుడు 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను, స్టాలిన్‌ను గెలిపించింది. అయితే ప్రజలు ఈ స్థాయిలో స్టాలిన్ పార్టీకి ఓట్లు వేయడానికి కారణాలేంటి? డీఎంకేను విజయ తీరాలకు చేర్చిన ఆ 'మంత్రం' ఏంటి?
నాయకత్వంతో..
10 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన డీఎంకేకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించిందంటే.. అందుకు ముఖ్య కారణం ఆ పార్టీ అధినేత స్టాలిన్. పార్టీ అభ్యర్థుల ఎంపిక నుంచి.. ప్రచారాల వరకు, ప్రజాకర్షక హామీల నుంచి.. అధికార పార్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం వరకు అన్నీ తానై చూసుకున్నారు స్టాలిన్.
"నా వారసుడు స్టాలిన్" అని బతికున్నప్పుడే కరుణానిధి ప్రకటించడం కూడా ఆయనకు కలిసివచ్చింది. పార్టీలో బలమైన నాయకత్వానికి పునాది పడింది కూడా అప్పుడే. తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న స్టాలిన్.. వీటిన్నిటి వల్ల మరో మెట్టు పైకి ఎక్కగలిగారు.
లోక్‌సభ ఎన్నికలతో మలుపు...
అయితే రాష్ట్రంలో డీఎంకే పట్టు సాధించింది మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే. 40 సీటల్లో 39 స్థానాలను వెనకేసుకున్న డీఎంకే.. అక్కడి నుంచి తిరిగి చూడలేదు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఏకంగా 52శాతం ఓట్లు దక్కించుకుంది. అన్ని వేళల్లోనూ పార్టీని ముందుండి నడిపించిన నేత స్టాలినే.
మేనిఫెస్టోతో సక్సెస్!
ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలన్న దృఢ సంకల్పంతో మేనిఫెస్టో రూపొందించింది డీఎంకే. స్టాలిన్ నేతృత్వంలోని ఈ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో.. యావద్దేశం దృష్టిని ఆకర్షించింది. విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో కలిపి 500 హామీలను ఇచ్చింది. విద్యా రుణాల మాఫీ, నీట్ రద్దు, పెట్రో ధరల తగ్గింపు, గృహిణులకు నెలకు రూ.1000 భృతి వంటివి వీటిలో ప్రత్యేకం. ఈ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఫలితాలే సూచిస్తున్నాయి.
ఇదీ చూడండి:తమిళనాట స్టాలిన్‌కే జై కొట్టిన సర్వేలు!