తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ డీడీసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి - డీడీసీ విధులు

స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత నాయకుల నిర్బంధం, ఎన్​కౌంటర్లు, చొరబాట్లు, కాల్పులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది జమ్ముకశ్మీర్​. ఆర్టికల్​ 370 రద్దు అనంతరం అక్కడ తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా డీడీసీ ఎన్నికల జరిగాయి. జమ్ముకశ్మీర్​లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన వీటి ఫలితాల యావత్​ దేశం ఆకక్తిగా ఎదురుచూస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు కౌంటింగ్​ ప్రారంభమవుతుంది. ఇంతకీ కశ్మీర్​లో జరిగిన ఈ ఎన్నికల విశేషాలేంటి ? డీడీసీ విధులేంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? వంటి అంశాలపై సమగ్ర కథనం.

Counting of votes for DDC elections in J-K to begin at 9 am
జమ్ముకశ్మీర్​ డీడీసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి

By

Published : Dec 22, 2020, 4:50 AM IST

జమ్ముకశ్మీర్​ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గతేడాది ఆ రాష్ట్ర స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన అనంతరం.. తొలిసారిగా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం జమ్ము కశ్మీర్​ పంచాయతీరాజ్​ చట్టంలోని 73వ సవరణను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా.. జమ్ముకశ్మీర్​లోని మొత్తం 20 జిల్లాల్లో 280 డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్ కౌన్సిల్​ (డీడీసీ)లను ఏర్పాటు చేశారు. నవంబర్​ 28 నుంచి డిసెంబర్​ 19 వరకు మొత్తం 8 విడతల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహించారు. ఫలితంగా జమ్ముకశ్మీర్​లో సరికొత్త అధ్యాయం మొదలైంది.

జమ్ముకశ్మీర్​ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల ఫలితాల కోసం యావత్​ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మంగళవారం ఉదయం 9గంటల నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో డీడీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

మొదటిసారి...

జమ్ము కశ్మీర్​లో డీడీసీల ఏర్పాటు ఇదే మొదటిసారి. ఇన్నాళ్లు స్వయం ప్రతిపత్తి అనుభవించిన రాష్ట్రంలో.. పంచాయతీరాజ్​ చట్ట సవరణ అమలుకు నోచుకోలేదు. ఆర్టికల్​ 370, 35ఏ రద్దు తర్వాత.. మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. నేషనల్​ కాన్ఫరెన్స్​, పీడీపీ, పీపుల్స్ మూవ్​మెంట్​, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ సహా మరో నాలుగు పార్టీలు కలిసి.. 'పీపుల్స్ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్'​ ఏర్పాటు చేసుకుని సంయుక్తంగా బరిలోకి దిగాయి.

పంచాయతీరాజ్​ చట్ట సవరణ ఏం చెబుతోంది ?

కశ్మీర్​లో ఈ చట్టాన్ని అక్టోబర్​ 16న కేంద్ర హోంశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కౌన్సిళ్ల ఏర్పాటు జరిగింది. ఇందులో సభ్యులను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకుంటారు.

జమ్ము కశ్మీర్ పునర్విభజన చట్టం-2019 సవరణల ద్వారా వీటిని తీసుకొచ్చారు. 370 అధికరణం రద్దుకు ముందు.. జమ్ము కశ్మీర్​ రాష్ట్రంలో చట్ట సవరణలు శాసనసభ పరిధిలోనే ఉండేవి. పునర్విభజన తర్వాత ఈ అధికారం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చింది.

అంతకుముందు 1989లో జమ్ము కశ్మీర్​ పంచాయతీరాజ్​ చట్టంలో 73వ సవరణ తర్వాత.. ఇక్కడ స్థానిక సంస్థల ఏర్పాటుకు డిమాండ్​ ఊపందుకుంది. అయితే, రాష్ట్రంలో ఎన్నికైన ఏ ప్రభుత్వం కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదు.

తాజా చట్ట సవరణలో రిజర్వేషన్లను సైతం పొందుపర్చారు. ముఖ్యంగా ఎస్సీ-ఎస్టీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం స్థానాల్లో మూడింట ఒక వంతుకు తగ్గకుండా ఈ వర్గాలకు సీట్ల కేటాయింపు జరపాలని చట్టంలో పొందుపర్చారు. అలాగే, ప్రతి డీడీసీలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయవలసిన మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్​ పద్ధతి ద్వారా రిజర్వుడు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది.

డీడీసీ ఎన్నికలు.. కూర్పు-విధులు ?

పునర్విభజనకు ముందున్న జమ్ము కశ్మీర్​లో.. డీడీసీ స్థానంలో పాలనా పరిషత్​లు ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రణాళిక, అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసేది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాతినిధ్యం వహించే ఈ బోర్డులకు రాష్ట్ర మంత్రి నేతృత్వం వహించేవారు. వీరి ఆధ్వర్యంలో బ్లాక్​ డెవలప్​మెంట్​ కౌన్సిల్, నగర పరిషత్​లు​, డిస్ట్రిక్ట్​ డెవలప్​మెంట్​ కమిషనర్​ ఉండేవారు. అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి.. అందుకు అనుగుణంగా నిధులు సమకూర్చుకునేవారు.

సవరణల తర్వాత అమలవుతోన్న చట్టంలో.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 14 డీడీసీ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి.. ఛైర్మెన్​, వైస్​-ఛైర్మెన్​లను ఎన్నుకుంటారు. కొత్త చట్టం ప్రకారం స్థానిక ఎంపీ.. డీడీసీల్లో ఉండరు.

డీడీసీ ఎన్నిక ముగిసిన అనంతరం.. అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడానికి, అమలు చేయడానికి వారికి అధికారం లభిస్తుంది. మున్సిపల్ పరిమితుల్లోకి వచ్చే ప్రాంతాలు మినహాయించి మొత్తం జిల్లాపై.. డీడీసీ అధికార పరిధి ఉంటుంది. ఒకేసారి అన్ని స్థానిక సంస్థలకు సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే తప్ప.. డీడీసీల పదవీకాలం ఐదేళ్లు కొనసాగుతుంది. మొత్తం సీట్లలో మూడింట ఒకటోవంతు మహిళలకు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో.. అన్ని స్థానిక సంస్థలకు కలిపి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు రావొచ్చు. అంతేకాకుండా ఈ డీడీసీ ఛైర్​పర్సన్​ పదవి మహిళలకు కేటాయించారు.

మొత్తంగా ప్రతి డీడీసీలో ఫైనాన్స్​ స్టాండింగ్ కమిటీతో పాటు.. అభివృద్ధి, ప్రభుత్వ నిర్మాణాలు, ఆరోగ్యం-విద్య, సంక్షేమం వంటి విభాగాలకు స్టాండింగ్​ కమిటీల ఏర్పాటు జరుగుతుంది. ప్రతి కమిటీలో సభ్యులతో పాటు ఛైర్​పర్సన్​ భాగంగా ఉంటారు. అన్ని కమిటీల్లో సమాన సంఖ్యలో సభ్యులు ఉండాలి. ఈ విధంగా జమ్ము కశ్మీర్​ స్థానిక సంస్థల చరిత్రలో కొత్త శకానికి నాంది పలకాయి.. ఈ డీడీసీ ఎన్నికలు.

8 దశలు..

డీడీసీ ఎన్నికలను నవంబరు 28 నుంచి డిసెంబర్​ 19 వరకు మొత్తం 8 విడతల్లో నిర్వహించారు. దాదాపు 51శాతం పోలింగ్​ నమోదైంది. భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్​కు అనమచారు.

మొత్తంగా లోయలో పంచాయతీరాజ్​ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు జరుగిన ఈ ఎన్నికలు.. జమ్ము కశ్మీర్ రాజకీయ భవితవ్యంపై భారీ ప్రభావమే చూపనున్నాయి.

ఇదీ చూడండి:కశ్మీర్​లో 'స్థానిక' పోరు- కార్యక్షేత్రంలోకి కాషాయదళం

ABOUT THE AUTHOR

...view details