counterfeit Indian coins: నకిలీ నాణేలు తయారుచేసి.. చలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు దిల్లీ పోలీసులు. ఐదుగురిని ఆదివారం అరెస్టు చేశారు. ముఠాలోని నరేష్ కుమార్, సంతోష్ మండల్‌ను ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరి దగ్గర ధర్మేంద్ర కుమార్ శర్మ, ధర్మేంద్ర మహతో, శ్రావణ్ కుమార్ శర్మలు పని చేస్తున్నట్లుగా గుర్తించారు.
10,112 నకిలీ రూ.10 నాణేలను నిందితుల దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఒక్కో దాంట్లో 4వేల ఇతర నాణేలు కలిగిన 20 ప్యాకెట్లను సీజ్ చేశారు. నాలుగు మెషీన్లు, ఎలక్ట్రిక్ మోటార్, నాణేల తయారికి ఉపయోగించే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నాణెం లోపల భాగం తయారికి ఉపయోగించే 212 కేజీల రాగి మెటీరియల్, నాణెం బయటి భాగం తయారికి వాడే 315 కిలోల ఇత్తడిని జప్తు చేశామని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.