సుప్రీంకోర్టు తీర్పుతో దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగినప్పటికీ.. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ సాఫీగా సాగడం లేదు. మూడో రోజు కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్ గందరగోళంగా మారింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆప్ కౌన్సిలర్ అశోక్ కుమార్ అక్కడే కుప్పకూలిపోయారు.
దిల్లీలో ఆప్-బీజేపీ నేతల మధ్య తోపులాట.. కుప్పకూలిన కౌన్సిలర్ - Delhi Mayor Elections Issue
దిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ జరిగే సమయంలో బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ కౌన్సిలర్ అశోక్ కుమార్ కుప్పకూలారు.
ఆరుగురు సభ్యులను ఎన్నుకునే పోలింగ్ ప్రక్రియలో కేవలం ఒక ఓటు చెల్లదని మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించిన నేపృథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ కౌన్సిలర్లు పరస్పరం దాడులకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొందరు నేతలు పరస్పరం చెంప దెబ్బలకు దిగగా మరికొందరు వస్త్రాలను చించుకున్నారు. దీంతో సభ ఉద్రిక్తంగా మారింది. ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీని ఎన్నుకునేందుకు మొత్తం 242 మంది కౌన్సిలర్లు శుక్రవారం ఓటింగ్‌లో పాల్గొన్నారు.
"బీజేపీ గూండాలు సిగ్గులేకుండా మేయర్‌తో పాటు ఇతర మహిళా సభ్యులపై కూడా దాడి చేశారు" ఆప్ కౌన్సిలర్ అశోక్ కుమార్ ఆరోపించారు. "మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. మేయర్ ద్వారా చెల్లని ఓట్లు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. బీజేపీ, ఆప్ పార్టీల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు గెలిచారు. కేజ్రీవాల్ ఆదేశాలతో ఇక్కడ ఆప్ కౌన్సిలర్లు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి ప్రవర్తనను మేము సహించేము. ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తాము" అంటూ బీజేపీ కౌన్సిలర్ హరీష్ ఖురానా వ్యాఖ్యలు చేశారు.