మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వ్యక్తిగత సలహాదార్లను ప్రశ్నించనుంది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). పోలీసు అధికారి పరంవీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల కేసులో.. వివరాలు వెల్లడించేందుకు సంజీవ్ పలాండే, కుందన్ అనే ఇద్దరు సలహాదార్లు తమ ముందు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది.
బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంవీర్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎంకు ఆయన రాసిన లేఖలో పలాండే పేరును పేర్కొన్నారు. దేశ్ముఖ్తో జరిపిన సంభాషణకు కుందన్ ప్రత్యక్ష సాక్షి అని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు సలహాదార్లను సీబీఐ ప్రశ్నించనుంది.