భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్-19(coronavirus) వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నామకరణం చేసింది. 'డెల్టా'గా పేరుపెడుతూ డబ్ల్యూహెచ్‌ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు గుర్తించిన కొవిడ్ వేరియంట్‌కు 'కప్పా'గా నామకరణం చేసింది. భారత్‌లో వెలుగుచూసిన కొవిడ్ వేరియంట్(covid variant) బి.1.617ను ఇండియన్ వేరియంట్ అని పలు దేశాలు పిలవడంపై భారత్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కొత్తగా వెలుగుచూసే కరోనా వైరస్‌లు లేదా వేరియంట్‌లను దేశాల పేర్లతో పిలవకూడదని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
ఈ నేపథ్యంలో భారత్‌లో వెలుగుచూసిన వేరియంట్‌కు 'డెల్టా'గా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నామకరణాలను నూతన పేర్లు భర్తీ చేయవని తెలిపింది. శాస్త్రీయ నామాలు విలువైన సమాచారం, పరిశోధనలో ఉపయోగపడతాయని పేర్కొంది. కొవిడ్ కొత్త వేరియంట్ల గుర్తింపు, నివేదిక ఇవ్వడంలో ఏ దేశం నిరాకరించకూడదని తెలిపింది. సార్స్-కోవ్-2 వైరస్ జన్యుక్రమాల పేరు పెట్టడం, వాటిని ట్రాక్ చేయడం కోసం ఏర్పాటు చేసిన నామకరణ వ్యవస్థలు శాస్త్రీయ పరిశోధనలలో వాడుకలో ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.