Corona thrid wave: కరోనా మొదటి రెండు దశలతో పోలిస్తే.. థర్డ్‌వేవ్‌లో దేశంలో మృతుల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. మూడో వేవ్‌లో మృతిచెందిన వారిలో 60శాతం మంది టీకాలు తీసుకోనివారు లేదా ఒక్క డోసు మాత్రమే తీసుకున్నవారు అని మాక్స్ హెల్త్‌కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరణించిన వారిలో అత్యధికులు 70 ఏళ్లకు పైబడినవారేనని తెలిపింది. వీరు కూడా కరోనాతోపాటు కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలతో బాధపడినవారేనని పేర్కొంది.
" థర్డ్ వేవ్‌లో మా ఆసుపత్రుల్లో 82 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 60శాతం మంది మొదటి డోసు మాత్రమే తీసుకున్నవారు లేదా మొత్తానికే టీకా తీసుకోనివారు. టీకాలు తీసుకోవడం కారణంగానే మూడో వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒమిక్రాన్ తీవ్రత, లక్షణాలు కూడా చాలా తక్కువగానే కనిపిస్తోంది. "
- మాక్స్ హెల్త్‌కేర్ ఆసుపత్రి యాజమాన్యం
మాక్స్ హెల్త్‌కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా.సందీప్ బుద్ధిరాజా ఆధ్వర్యంలో.. కరోనా మొదలైనప్పటి నుంచి ఈ జనవరి 20వ తేదీ వరకు సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
కొవిడ్ మూడో దశలో 23.4శాతం మంది మాత్రమే ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారని అధ్యయనం తెలిపింది. అదే రెండో వేవ్‌లో ప్రాణవాయువు వినియోగం 74శాతంగా, మొదటి దశలో 63 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. ఇందుకు పలు అంశాలను జోడించింది. 'గతేడాది ఏప్రిల్(సెకండ్ వేవ్)లో దిల్లీలో 28వేల కేసులు నమోదవగా.. అన్ని ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. ఐసీయూ పడకలు దొరకడం గగనమైంది. కానీ గత వారం(థర్డ్ వేవ్)లో దిల్లీలో దాదాపు అన్నే కేసులు నమోదైనా.. ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య తక్కువే. ఆస్పత్రుల్లో పడకలకు ఎలాంటి కొరత ఏర్పడలేదు' అని అధ్యయనం వివరించింది. మూడు దశల్లో ఆసుపత్రుల్లో చేరినవారి సంఖ్య వరుసగా 20883, 12444, 1378 ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:కేరళలో మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. దిల్లీలో 6నెలల గరిష్ఠానికి మరణాలు