Corona virus cases: దేశంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ ఉద్ధృతి ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ తొలివారంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేలుగా ఉండగా.. ప్రస్తుతం అది 17వేలకు దాటింది. ఇలా గడిచిన 10 రోజుల్లోనే కొవిడ్ క్రియాశీల కేసుల్లో 241శాతం పెరుగుదల కనిపించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక మహారాష్ట్రలో కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతుండటం వల్ల కొవిడ్ మరణాల రేటు 1.86శాతంగా నమోదైంది.
మహారాష్ట్రలో ఆదివారంతో పోలిస్తే సోమవారం కొత్త కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 2,946 కేసులు రాగా.. సోమవారం రెండు వేల దిగువకు చేరి 1,885 మందికి వైరస్ సోకింది. ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 79,12,462, మరణాల సంఖ్య 1,47,871కి చేరింది. ఒక్క ముంబయిలోనే 1,118 కేసులు వచ్చాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే.. 38 శాతం తగ్గటం కాస్త ఊరట కలిగించే విషయమే. ముగ్గురిలో బీఎ4, బీఏ5 వేరియంట్లు నిర్ధరణ కాగా..వారు ఇప్పటికే వైరస్ నుంచి కోలుకున్నారు.
కేసులు పెరుగుతున్నా.. స్వల్ప లక్షణాలే.. కొన్ని నెలల క్రితం వరకూ కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ మే నెల నుంచి మళ్లీ క్రమంగా పెరగడం ప్రారంభించింది. మే నెలలో మహారాష్ట్రలో 9354 పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో 5980 కేసులు కేవలం ముంబయి మహానగరంలోనే నమోదయ్యాయి. అంతేకాకుండా ఈ నెలలో 17 కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇక జూన్ నెలలో ఈ వైరస్ ఉద్ధృతి మరింత పెరగగా.. మొదటి 12 రోజుల్లోనే 23,941 కేసులు వెలుగు చూశాయి. వీటిలో 15,945 కేసులు ఒక్క ముంబయి నగరంలోనే బయటపడ్డాయి. జూన్‌లో ఈ 12 రోజుల్లో 12 కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్నప్పటికీ బాధితుల్లో లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా చాలా తక్కువేనని వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా తాజా వేవ్‌కు కొత్తరకం వేరియంట్ కాకపోవచ్చని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.