Corona Restrictions in India: కొవిడ్ ఆంక్షలను ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది కేంద్రం. దేశవ్యాప్తంగా 407 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉండటంతో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ వ్యాప్తి, కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కంటైన్‌మెంట్ చర్యలను ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శిఅజయ్ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగా ఉండటం, బాధితులు త్వరగా కోలుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 22 లక్షలు దాటిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాలలో పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
Vaccination in India
దేశంలో వయజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా తొలి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు వైద్య సిబ్బందిని, దేశ ప్రజలను అభినందించారు. "భారత్.. టీకా అర్హుల్లో 95 శాతం కంటే ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ తొలి డోసును అందించి అసాధారణ రికార్డు సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వైద్య సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైంది. ఈ ప్రక్రియ నిరంతరం ముందుకు కొనసాగుతోంది" అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో కరోనా టీకాల పంపిణీ 164.35 కోట్లు (1,64,35,41,869) దాటింది. గురువారం సాయంత్రం 7 గంటల వరకు 49 లక్షలపైగా(49,69,805) టీకాలు పంపిణీ చేశారు. వారిలో 14,83,417 మంది తొలి డోసు అందుకున్నారు. ఇందులో 15-18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలకు 5,43,227 టీకా డోసులను పంపిణీ చేశారు. 28,94,739 మంది వయోజనులకు టీకా రెండో డోసు పంపిణీ చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతించిన కరోనా.. కేరళలో వైరస్ ఉద్ధృతి