Omicron replacing delta: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఫలితంగా వైరస్ బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఇన్నాళ్లు ప్రబలంగా ఉన్న కరోనా డెల్టా వేరియంట్ స్థానాన్ని 'ఒమిక్రాన్' భర్తీ చేయడం ప్రారంభమైందని అధికార వర్గాలు శుక్రవారం హెచ్చరించాయి. కరోనా సోకిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 80శాతం మంది 'ఒమిక్రాన్' బాధితులేనని తెలిపాయి.
Omicron india cases: 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు మొత్తం 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అయితే.. మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో మూడో వంతు కేసులు.. స్వల్ప లక్షణాలు ఉన్నాయిని, మిగతా వారికి లక్షణాలే లేవని చెప్పారు.
దేశంలో 'ఒమిక్రాన్' కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం సూచించింది.
అప్రమత్తంగా కేంద్రం..
దేశంలో డిసెంబరు 2న ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు వెలుగు చూసింది. అప్పటి నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ ఒమిక్రాన్ కట్టడి కోసం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేస్తూ వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం... ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, వైద్య వ్యవస్థ సన్నద్ధతపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా కూడా వైద్య నిపుణులు, సీనియర్ అధికారులతో కరోనా పరిస్థితిని పర్యవేక్షిస్తూ వస్తున్నారు.
Vacciantion in india: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని, వైద్యవ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ పలుమార్లు సూచించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. దేశ జనాభాలో ఇప్పటికే 64.04శాతం మందికి పూర్తి స్థాయి టీకా డోసు అందించింది.
ఇదీ చూడండి:ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు
ఇదీ చూడండి:దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 16వేల మందికి వైరస్