Corona lockdown: తమిళనాడులో ఆదివారం(జనవరి 23న) పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. కరోనా కట్టడే లక్ష్యంగా ఇలా చేస్తున్నట్లు తెలిపారు.
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత..
మరోవైపు.. వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. సీనియర్ అధికారులతో కలిసి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో రెండు గంటలపాటు చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. కేసులు, ముఖ్యంగా హాస్పిటల్లో చేరికలు పెరిగితే.. తక్షణమే ఆంక్షల్ని తిరిగి అమలు చేస్తామని తెలిపారు రెవెన్యూ శాఖ మంత్రి అశోక్. అయితే రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ మాత్రం యథావిధిగా అమల్లో ఉంటుందని చెప్పారు. 50శాతం ఆక్యుపెన్సీలో కూడా మార్పు ఉండదన్నారు.
దిల్లీలో ఇలా..
దిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపాదించగా.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తిరస్కరించారు. పరిస్థితి మెరుగుపడే వరకు ప్రస్తుతమున్న ఆంక్షల్ని ఇలానే కొనసాగించాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో పనిచేసేందుకు అనుమతించాలన్న దిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
కశ్మీర్లో ఆంక్షలు..
కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నందు వల్ల 64 గంటలపాటు లాక్డౌన్ అమలు చేయాలని జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం నిర్ణయించింది. ఇక్కడ గురవారం ఒక్కరోజే 5,992 కేసులు వెలుగు చుశాయి. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి ఆంక్షలను అమలు చేస్తోంది ప్రభుత్వం. సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. నిత్యావసర సేవలకు మాత్రం అనుమతులు ఉంటాయని స్పష్టం చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:'నేను కాక ఇంకెవరు?'.. యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక హింట్!