Corona in maharashtra: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.
"మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రధాని మోదీ సైతం ప్రజలను ఇదే కోరారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించారు. ముంబయి, పుణెలో కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు అనివార్యం. ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి."
-అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం.
Maharashtra corona cases: శుక్రవారం మహారాష్ట్రలో 8,067 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్యలో 50 శాతం వృద్ధి రికార్డయ్యింది. ఈ నేపథ్యంలోనే పవార్ హెచ్చరించాల్సి వచ్చింది. ఇప్పటికే జనసమూహాలపై మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది. 2021 చివరి 12 రోజుల్లో మహారాష్ట్రలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముంబయిలో శుక్రవారం 5,631 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే 2,000 కేసులు అధికంగా నిర్ధారణ అయ్యాయి. దీంతో నగరంలో కేసులు 7,85,110కి చేరాయి. ఇక పుణెలో పాజిటివిటీ రేటు 5.9 శాతం పెరిగింది. శుక్రవారం కొత్తగా 412 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ నగరంలో కేసుల సంఖ్య 5,10,218కి చేరింది.