దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజులుగా వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండో దశలో రోజుకు 1,750 మంది మృతి చెందే ప్రమాదం పొంచి ఉందని, జూన్ మొదటి వారం నాటికి ఆ సంఖ్య 2,320కి చేరుకోవచ్చని లాన్సెట్ కొవిడ్-19 కమిషన్ వెల్లడించింది. 'మేనేజింగ్ ఇండియాస్ కొవిడ్-19 వేవ్: అర్జెంట్ స్టెప్స్' శీర్షికన ఓ నివేదిక వెలువడింది. కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసే చర్యలను అందులో ప్రస్తావించింది.
కొవిడ్ రెండో దశ.. కొన్ని ప్రాంతాలకే పరిమితం
కరోనా రెండు దశల్లో కూడా భౌగోళికంగా సామీప్యతను కలిగి ఉన్నప్పటికీ.. టైర్ 2, టైర్ 3 నగరాల్లోనే తీవ్రత అధికంగా ఉందని ఆ నివేదిక ప్రాథమికంగా విశ్లేషించింది. అలాగే కొవిడ్ విజృంభించిన మొదటి 50 శాతం జిల్లాల సంఖ్య గతేడాది 40కి పైగా ఉండగా.. ఇప్పుడు 20కి పడిపోయాయి. కరోనా కేసుల పరంగా 75 శాతం వాటా ఉన్న జిల్లాల సంఖ్య కూడా 60-100 నుంచి 20-40కి పడిపోయినట్లు వెల్లడించింది.
వేగంగా విస్తరిస్తున్న రెండో దశ..
రెండో దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ప్రారంభానికి (దాదాపు 40 రోజుల్లో) రోజువారీ కొత్తకేసులు పదివేల నుంచి 80 వేలకు పెరిగాయి. అదే గతేడాది దీనికి 83 రోజులు పట్టింది. అయితే, ఈ దశలో కొవిడ్ బారిన పడిన వారిలో లక్షణాలు లేకపోవడం లేదా స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటం కనిపిస్తోందని తెలిపింది. దాంతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషించింది.